చిప్‌తో చీటింగ్!

Published: 26-11-2022

* పెట్రోల్ బంకుల్లో హైటెక్ మోసం
* పెద్దాపురం, సామ‌ర్ల‌కోటలో ఫిర్యాదుల వెల్లువ‌
* వినియోగ‌దారుల జేబుకు చిల్లు
* ప‌ట్టించుకోని అధికార యంత్రాంగం

పెద్దాపురం:  అధికారుల నిర్ల‌క్ష్యం, పెట్రోల్ బంకు యాజ‌మాన్యాల మోసాల‌తో వాహ‌న‌దారుల జేబుకు చిల్లుప‌డుతోంది. పేట్రేగుతున్న పెట్రోల్ మోసాల‌కు వినియోగ‌దారులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు. పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్న‌ప్ప‌టికీ సంబంధిత అధికారులు అల‌స‌త్వం వ‌హిస్తున్నారు. అదే అదునుగా మోసాగాళ్లు మ‌రింత రెచ్చిపోతున్నారు. అడ్డూ అదుపూ లేకుండా చెల‌రేగిపోతూ బురిడీ కొట్టిస్తున్నారు. 
పెద్దాపురం, సామ‌ర్ల‌కోట ప్రాంతాల్లో 15 పెట్రోల్ బంకులకుపైగా ఉన్నాయి. వీటిపై నిత్యం ఎవ‌రొక‌రు ఫిర్యాదులు చేస్తూనే ఉంటున్నారు. కానీ సంబంధిత అధికారులు మాత్రం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో రెండు మున్సిపాలిటీల ప‌రిధిలో ఉన్న బంకుల్లో భారీగా మోసం జ‌రుగుతుంద‌ని వినియోగ‌దారులు ఆరోపిస్తున్నారు. ప‌ర్య‌వేక్షించాల్సిన అధికారులు మిన్న‌కుండిపోవ‌డంతో బంకు య‌జ‌మానులు మ‌రింత మోసానికి పాల్ప‌డుతున్నార‌ని వాహ‌న‌దారులు ఆవేద‌న చెందుతున్నారు. లీట‌రు పెట్రోల్ కొట్టిస్తే త‌మ వాహ‌నానికి రావాల్సిన క‌నీస మైలేజీ రావ‌డం లేద‌ని, వాహ‌నాలు మ‌ధ్య‌లోనే ఆగిపోతున్నాయంటున్నారు. మీట‌రులో డ‌బ్బుల‌కు త‌గ్గ‌ట్టు రీడింగ్ క‌నిపిస్తున్నా పెట్రోల్ త‌క్కువ‌గా వ‌స్తుంద‌ని, యాజమాన్యాల‌ను నిలదీస్తున్నా ఎటువంటి ప్ర‌యోజ‌నం ఉండ‌టం లేద‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. సామ‌ర్ల‌కోటలోని స్టేష‌న్ సెంట‌ర్‌, బ్రౌన్‌పేట, మోహ‌ర్ కాంప్లెక్స్‌, పెద్దాపురంలోని స్వ‌ర్ణ‌దేవాల‌యం ప‌క్క‌న‌, సుధాకాల‌నీ ఏరియా, గుర్రాల సెంట‌ర్ల‌లో ఉన్న బంకుల్లో భారీ మోసాలు జ‌రుగుతున్నాయ‌ని క‌స్ట‌మ‌ర్లు బ‌హిరంగంగా ఆరోపిస్తున్నారు. 
అనుమ‌తులు నిల్‌.. క‌ల్తీ ఫుల్‌
రెండు ప‌ట్ట‌ణాల‌తోపాటు బైపాస్ రోడ్డును ఆనుకుని ఉన్న బంకుల‌కు పూర్తిస్థాయిలో అనుమ‌తులు లేవ‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. దానికి త‌గ్గ‌ట్టుగానే బంకుల య‌జమానులు మెషిన్ల‌లో ఎల‌క్రానిక్ చిప్‌లు ఏర్పాటు చేసి వాహ‌న‌దారుల‌ను బురిడీకొట్టిస్తున్నారు. దీనికార‌ణంగా లీట‌రు పెట్రోల్‌కు రీడింగ్ స‌రిగానే చూపిస్తున్న‌ప్ప‌టికీ 50మిల్లీలీట‌ర్ల నుంచి  90మి.లీట‌ర్లు త‌క్కువ వ‌స్తుంద‌ని వినియోగ‌దారులు ఆందోళ‌న చెందుతున్నారు. దీనికితోడు బంకుల‌న్నీ క‌ల్తీకి పాల్ప‌డుతున్నాయ‌ని, ఫ‌లితంగా వాహ‌నాలు పాడైపోతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. బంకుల్లో త‌ప్పుడు రీడింగుతోపాటు క‌ల్తీ పెట్రోల్ కొట్ట‌డం కార‌ణంగా సామాన్యుల క‌ష్టార్జితమంతా వాహ‌నాల మ‌ర‌మ్మ‌తుల‌కే స‌రిపోతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. 
అధికారుల నిర్ల‌క్ష్య‌మే..
లీగ‌ల్ అండ్ మెట్రాల‌జీ, రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు 3నెల‌ల‌కు ఒక‌సారి పెట్రోల్ బంకుల‌ను ప‌ర్య‌వేక్షించాలి. బంకుల్లో ఎలాంటి మోసాలు జ‌ర‌గ‌కుండా నిఘా పెట్టాలి. కానీ అధికార యంత్రాంగం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తుంది. పెద్దాపురం, సామ‌ర్ల‌కోట ప్రాంతాల్లో నిత్యం ఫిర్యాదులు అందుతున్న‌ప్ప‌టికీ ప‌ట్టించుకున్న దాఖ‌లాలేమీ లేవు. దీంతో వ్యాపారులు చెల‌రేగిపోతూ సామాన్యుల‌తో ఆడుకుంటున్నారు. గ‌త రెండేళ్ల కాలంలో సంబంధిత శాఖ‌ల అధికారులు ఏ బంకుల్లోనూ త‌నిఖీలు చేప‌ట్ట‌లేదు. అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ లోపించ‌డం వ‌ల్లే పెట్రోల్ మోసాలు పెరుగుతున్నాయ‌ని వినియోగ‌దారులు చెబుతున్నారు. ఇప్ప‌టికైనా సంబంధిత ఉన్న‌తాధికారులు స్పందించి పెట్రోల్ బంకుల్లో త‌నిఖీలు చేప‌ట్టి బంకు య‌జ‌మానుల మోసాల‌కు అడ్డుక‌ట్ట వేయాల‌ని వినియోగదారులు కోరుతున్నారు.