లాజిక్ మిస్సవ్వుతున్న దవులూరి

* టికెట్ కోసం మంత్రులకు భజన
* నియోజకవర్గంలో నేతల అసంతృప్తి
* దిగజారుతున్న పార్టీ పరిస్థితి
కాకినాడ: పెద్దాపురం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతుంది. వైఎస్సార్ సీపీ పెద్దాపురం కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు పార్టీని ముందుండి నడిపించడంలో విఫలమవుతున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. తమ పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలను సమన్వయం చేసుకోవడం మానేసి జిల్లాలోని మంత్రులను, ఎంపీలను ఆకర్షించే ప్రయత్నాల్లో ఉన్నారని తేలతెల్లమవుతోంది. ఒక పక్క టీడీపీలోకి బొడ్డు భాస్కరరామారావు తనయుడు వెంకట రమణ చౌదరి చేరడంతో టీడీపీపై ప్రజలు మొగ్గు చూపుతున్నారు. వైఎస్సార్ సీపీకి మద్దతు ఇచ్చే కమ్మ సామాజికవర్గ నాయకులు కూడా నేడు టీడీపీలోకి జారుకుంటున్నారు. నియోజకవర్గ రాజకీయాల్లో నిప్పు రాజుకుంటుంటే దవులూరి మాత్రం గజమాలలతో మంత్రులకు, ఎంపీలకు స్వాగతాలు పలికే పనిలో ఉన్నారని సర్వత్రా విమర్శిస్తున్నారు. ఇప్పటికే పార్టీని సామర్లకోటలోని దళితులు బహిష్కరించారు. అయినప్పటికీ దవులూరి వైఖరిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో పార్టీ కార్యకర్తలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీసం పార్టీలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారని సొంత పార్టీ కార్యకర్తలే అభిప్రాయపడుతున్నారు.
టికెట్ ఇచ్చినా ఫలితం ఉండదా?
దవులూరి ఎమ్మెల్యే టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారని, దాని కోసం మంత్రులు, ఎంపీలు, రీజనల్ కోఆర్డినేటర్లకు పెద్దపీట వేస్తున్నారని అందరినోటా వినపడుతుంది. అయితే రేపొద్దున్న వీధుల్లో తిరిగి అభ్యర్థించే పార్టీ నాయకులను, కార్యకర్తలను పట్టించుకోవడం లేదు. దీంతో రేపొద్దున వారు చొరవగా తిరిగే అవకాశం కనిపించడం లేదని పలువురు నేతలు చెబుతున్నారు. ఒకవేళ టికెట్ ఇచ్చినా ఆయన కోసం పనిచేసేందుకు కిందస్థాయి నేతలు ఒకరిద్దరు తప్ప ఎవరూ పెద్దగా కనిపించడం లేదు. కాపు సామాజికవర్గంలోని నేతలు కూడా నేడు వెంటకరమణ చౌదరి దగ్గరకు జారుకున్నారు. ఇదిలా ఉంటే టికెట్ దవులూరికి ఇస్తే ఏం ప్రయోజనం, నెగ్గేవాడికి ఇవ్వాలికాని అంటూ నియోజకవర్గంలోని ప్రజానీకం సైతం చెబుతోంది. టికెట్ కోసం అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నారే తప్ప ఓట్లు వేసే ప్రజలను, ఓట్లు అభ్యర్థించే నేతలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇంత చిన్న లాజిక్ దవులూరి ఎలా మిస్సవ్వుతున్నాడానని అందరూ భావిస్తున్నారు.

Share this on your social network: