తెర‌పైకి నాయుడు, గొర‌క‌పూడి పేర్లు

Published: 19-03-2022

పెద్దాపురం:  తోట‌ నాయుడు లెక్క వేరండి.. అంద‌రినీ క‌లుపుకుపోతుంటాడు.. ఆత్మాభిమానం దెబ్బ‌తిన‌డం వ‌ల్ల బ‌య‌ట‌కు వెళ్లిపోయాడే కానీ నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాల్లో ఆయ‌నది కీల‌క‌పాత్ర‌. ఆయ‌న తండ్రి అనంత‌రం వైఎస్సార్ సీపీ జెండాను భుజాన‌కేసుకుని ముందుండి న‌డిపించాడు. మ‌ళ్లీ ఆయ‌న యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వ‌స్తే క‌థ వేరే ఉంటుంది. అటు చిన‌రాజ‌ప్ప‌కు కానీ, ఇటు ద‌వులూరికి కానీ స‌రైనోడు వ‌చ్చాడన‌ట్టుంటుంది. నియోజ‌క‌వ‌ర్గంలోని ఓ వ‌ర్గం నుంచి వినిపిస్తున్న మాట‌లివి. నాయుడిదే ఆల‌స్యం  రెండు ప్ర‌ధాన పార్టీలు కూడా ఆయ‌న‌ను  ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ఆయా పార్టీల్లోని సీనియ‌ర్ నాయ‌కుల గుసగుస‌లు.

లోక‌ల్ అంటే గొరక‌పూడి ఒక్క‌రే..
పెద్దాపురం నియోజ‌క‌వ‌ర్గానికి లోక‌లోడు ఎమ్మెల్యే  అవ్వాలండి.. ఎన్నాళ్లు చూసినా బ‌య‌టి నుంచి ప‌ద‌వులు పొంది మ‌న‌కు మొండిచేయి చూపిస్తున్నారే త‌ప్ప మ‌నోడు ఎవ‌డూ ఎమ్మెల్యే అవ్వ‌డం లేదు.. సామ‌ర్ల‌కోట‌లో గొర‌క‌పూడి చిన్న‌య్య‌దొర ఉన్నాడంటే ఆయ‌న స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్నాడు. పోనీ అలాంటి వ్య‌క్తిని, ఆయ‌న సేవ‌ల‌ను ఈ పార్టీలు ఏమైనా గుర్తిస్తున్నాయా అంటే అదీ లేదు. పోనీ లోక‌లోళ్లు ద‌వులూరి, తుమ్మ‌ల వంటి వారు ఉన్నారంటే వారు ప్ర‌జ‌ల మ‌ధ్య‌లోకి రారు. అలాగ‌ని కొద్దోగొప్పో సేవాతత్వంతో ముందుకుపోయే స్థానికుడైన గొర‌క‌పూడికి ప్ర‌ధాన పార్టీలు  టికెట్ ఇవ్వ‌వు. ఇలా అయితే మ‌న‌కు లోక‌లోడు ఎమ్మెల్యే ఎలా అవుతారు.. ఇది మ‌రో వ‌ర్గం నుంచి ఈ మ‌ధ్య‌న ఎక్కువ‌గా వినిపిస్తున్న మాట‌లు.