ఆత్మీయంగా పలకరిస్తూ.. సమస్యలు వింటూ

Published: 24-10-2018
వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర మంగళవారం విజయనగరం జిల్లా సాలూరు మండలంలో కొనసాగింది. దారి పొడవునా ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ ముందుకు నడిచారు. విద్యార్థులతో సెల్ఫీలు దిగారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఎక్కడా బహిరంగ సభలు లేకపోవడంతో ఆయన ప్రసంగాలు కూడా లేవు. ఉదయం సాలూరు రైల్వే గేటు సమీపంలోని విశ్రాంతి స్థలం నుంచి జగన్‌ పాదయాత్ర ప్రారంభించారు.
 
కొద్దిదూరం నడిచాక గిరిజన సంక్షేమశాఖలో పనిచేస్తున్న సీఆర్టీలు.. తమ ఉద్యోగాలను రెగ్యులర్‌ చేయాలని, వేతనాలు పెంచాలని ఆయన్ను కోరారు. అనంతరం పలువురు దివ్యాంగులు తమ సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. సాలూరు మున్సిపల్‌ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు కూడా ఆయన్ను కలిశారు. కాంట్రాక్టరుకు 15 శాతం కమీషన్‌ దోచిపెట్టడమే లక్ష్యంగా జీవో 279 తెచ్చారని కార్మిక నేతలు వినతిపత్రమిచ్చారు.
 
తామరకొండ గ్రానైట్‌ తవ్వకాలను ఆపించాలని, దుక్కడమెట్ట, పోలిమెట్ట సహా మండలంలో ఎక్కడ మైనింగ్‌ తవ్వకాలు లేకుండా చూడాలని కోరుతూ సీపీఎం నేత మర్రి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. వెంగళరాయసాగర్‌పై ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తానని జగన్‌ అందరికీ హామీ ఇచ్చారు.