Published: 24-11-2018
స్పైసీ పేరడైజ్‌లో పాచిపోయిన చికెన్

విశాఖ: నగరంలోని కొన్ని రెస్టారెంట్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. డబ్బు సంపాదనే లక్ష్యంగా చేసుకొని పాడైన వంటకాలను సైతం ఫ్రిజ్‌లో పెట్టి, వేడి చేసి వడ్డించేస్తున్నాయి. రుచి, రంగు కోసం ప్రమాదకరమైన రంగులను ఆహార పదార్థాల్లో కలిపేస్తున్నాయి. నిత్యం జనాలతో కిటకిటలాడే జగదాంబ సెంటర్‌లోని స్పైసీ ప్యారడైజ్ రెస్టారెంట్‌పై విజిలెన్స్ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించగా, కళ్లు తిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. జగదాంబ సెంటర్‌లో చర్చి పక్కనే ఈ రెస్టారెంట్ ఉంది. లోపలకు వెళ్లి ఫ్రిజ్‌ను తెరిచి చూడగా, వండిన చికెన్, ఇతర మాంసాహార పదార్థాలు కనిపించాయి. వాటి గురించి ఆరా తీయగా, ఇవి ముందురోజు మిగిలిన వంటకాలని, పాడైపోకుండా ఫ్రిజ్‌లో పెట్టినట్టు అక్కడి సిబ్బంది తెలిపారు. వాటిని ఏమి చేస్తారని ప్రశ్నించగా కస్టమర్లు వస్తే, వేడి చేసి సరఫరా చేస్తామని వెల్లడించడంతో అధికారులు విస్తుపోయారు.
అలాగే ఫ్రై చేసిన చికెన్ జాయింట్లు, చికెన్ మంచూరియా, లివర్, పుల్లటి వాసన వస్తున్న పెరుగు తదితరాలన్నీ దర్శనమిచ్చాయి. వాటి నుంచి దుర్వాసన కూడా వెలువడుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఏ రోజుకా రోజు సరకులు తెచ్చుకోరా? అని ప్రశ్నించగా, ఒక్కోసారి మాంసాహారం మిగిలిపోతుంటుందని, వాటిని ఇలా నిల్వ చేసి మరుసటిరోజు ఉపయోగిస్తామని సిబ్బంది పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో భాగంగా బుష్ కంపెనీ ఆరెంజ్, రెడ్ పౌడర్ బయటపడింది. అది ఫుడ్ కలర్. చాలా తక్కువ మోతాదులో కొన్ని వంటకాల్లోనే ఉపయోగిస్తారు. ఇందులో సల్ఫ్యూరిక్ యాసిడ్ కలిసి ఉంటుంది. మోతాదుకు మించి కలిపితే క్యాన్సర్ వంటి రోగాలు వస్తాయి. అంత ప్రమాదకరమని తెలిసినా దానిని ఈ రెస్టారెంట్‌లో ఫిష్, చికెన్ ఫ్రైలకు దానిని విచ్చలవిడిగా ఉపయోగించడం చూసి అధికారులు ఆందోళన చెందారు.
వంటకు వినియోగిస్తున్న ఆయిల్‌ను కూడా పరిశీలించారు. అది బాగా నల్లగా వుండడంతో ప్రశ్నించారు. చికెన్ ఫ్రైకు ఉపయోగిస్తుం చేస్తుంటామని, అందుకే అలా వుందని బదులిచ్చారు. ఒకే నూనెను పదే పదే మరిగిస్తే దాని వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం వుందని విజిలెన్స్ డిఎ్‌సపి పి.ఎం.నాయుడు పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఆయనతో సీఐ ఎస్.శ్రీనివాసరావు, జీవీఎంసి ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అప్పారావు పాల్గొన్నారు. నిల్వ చేసిన, పాడైన ఆహార పదార్థాల శాంపిళ్లను సేకరించారు. అలాగే పక్కనే మరో హోటల్‌కు కూడా వెళ్లారు. అక్కడ కూడా కొన్ని శాంపిల్స్ తీసుకున్నారు. వాటిని లేబొరేటరీకి పంపిస్తామని, అవి అనారోగ్యం కలిగిస్తాయని తేలితే భారీ జరిమానా విధిస్తామని అధికారులు తెలిపారు.
