Published: 24-11-2018
26న ప్రకటిస్తానన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

తన భవిష్యత్తు కార్యాచరణను ఈ నెల 26న ప్రకటించనున్నట్లు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఆయన ఇటీవల వీఆర్‌ఎస్ తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఏపీలోని పలు జిల్లాల్లో పర్యటించి అక్కడి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. తన ఆలోచనలతో ఏకీభవించే వారితో ఈ నెల 26వ తేదీన భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు ఉదయం హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి... లోట్‌సపాండ్ వద్ద రావి నారాయణ హాల్‌లో సమావేశం కావాలని భావిస్తున్నారు. పార్టీగా పెట్టాలా... లేదా ఒక ప్రజా ఉద్యమ వేదికను ప్రారంభించాలా అనే విషయంపై ఇంత వరకూ తాను ఓ నిర్ణయానికి రాలేదని, ఆ రోజు అందరితో చర్చించాక నిర్ణయం తీసుకుంటానని, అదే రోజు నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు.
