Published: 21-11-2018
భార్యకు తెలియకుండా భూమిని భర్తా అమ్మలేడు

భూ వివాదాలను పరిష్కరించాలన్న ఏకైక సంకల్పంతో అత్యాధునిక సాంకేతికతతో కూడిన భూధార్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చింది. మంగళవారం ఉండవల్లి ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేవ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన అధికారులు, రైతులను ఉద్దేశించి మాట్లాడారు. నా చిరకాల వాంఛ ఇన్నాళ్లకు నెరవేరింది. ప్రజలు, గ్రామాల మధ్య భూమి వివాదాలు తగ్గించేందుకే భూధార్‌ను తీసుకొచ్చాం. ప్రతి ఒక్కరి భూమికి 11 అంకెల విశిష్ట నంబర్ భూధార్‌ను కేటాయించాం. ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు. 1998 నవంబరులో రిజిస్ట్రేషన్ శాఖలో కార్డ్ ప్రాజెక్టు అమల్లోకి తీసుకొచ్చానని, మళ్లీ 20 ఏళ్ల తర్వాత భూధార్‌ను ప్రవేశపెట్టామని సీఎం చెప్పారు. భూధార్ ద్వారా భూములు సురక్షితంగా ఉంటాయని, భూ వివాదాలు తగ్గుతాయన్న ఆయన, చివరకు భర్త తన భార్యపేరిట ఉన్న భూములను సైతం ఆమెకు తెలియకుండా అమ్మలేరంటూ చమత్కరించారు.
భూమి అనేది అతిపెద్ద సమస్య. గతంలో హైదరాబాద్‌లో ఈ సమస్యను చూశాం. అక్కడ నిజాం ఉన్నారు. ఆయన ఒకే భూమిని ఐదారుగురికి ఇచ్చారు. ఆ భూమికోసం వారు తగువు పడేవారు. లిటిగేషన్లు వచ్చి అనేక వివాదాలు వ చ్చాయి. వాటిని కాపాడేందుకు నిషేధ జాబితాలో పెట్టాలని అప్పటి హైదరాబాద్ కలెక్టర్‌ను ఆదేశించా. ఏ భూమి ఎవరిది? ఏది లిటిగేషన్‌లో ఉంది? అన్న జాబితాలు తయారు చేసి ఎమ్మార్వో కార్యాలయాల్లో భద్రపరిచాం. భూములను భద్రంగా కాపాడాం. కానీ మా తర్వాత వచ్చిన నాయకులు ఏరికోరి వివాదంలో ఉన్న భూముల పత్రాలను ఫోర్జరీ చేసి విలువైన భూములను కాజేశారు. ఏపీలో ఇలాంటివి సాధ్యంకాదు. ఇప్పుడు మీ భూమిని మీరు జేబులో పెట్టుకొని తిరగొచ్చు. మీ భూముల వివరాలన్నీ భూధార్ కార్డులో ఉంటాయి. మీ వేలిముద్ర, కనుపాపలు, ముఖ చిత్రాల గుర్తులు ఎవరూ ఫోర్జరీ చేయలేరు. కాబట్టి మీ భూములు ఎక్కడికీ పోవు. ఎవరూ మీ భూములను కొట్టేయలేరు. రాబోయే రోజుల్లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వచ్చినా.. ఆశ్చర్యం లేదన్నారు. ఇప్పటికే 1954కు ముందు అసైన్డ్ అయిన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాం.
త్వరలో చుక్కల భూముల సమస్య కూడా పరిష్కారమవుతుంది అని వివరించారు. సమస్యల పరిష్కారంపై తాను రైతులకు ఫోన్‌చేసి మాట్లాడుతానని, సమస్యల పరిష్కరించే పేరిట రైతుల నుంచి డబ్బుతీసుకుంటే వదిలిపెట్టనని హెచ్చరించారు. కాగా, భూదార్ ప్రాజెక్టులో మాస్టర్‌మైండ్‌గా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, యూఐడీఐ ఛైర్మన్ జె.సత్యనారాయణను సీఎం ప్రశంసించారు. 1998లో తాను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కార్డ్ ప్రాజెక్టు ప్రవేశపెట్టినప్పుడు సత్యనారాయణే పనిచేశారని గుర్తు చేసుకొన్నారు. ఈ సందర్భంగా సత్యనారయణ మాట్లాడుతూ.. కార్డు ధరను త్వరలో ఖరారు చేస్తారని తెలిపారు. 2,39. 69, 159 భూ కమతాలకు గాను 1.39 కోట్ల వివరాలను భూధార్ డేటాకు అప్‌లోడ్ చేశామని తెలిపారు.
మొబైల్, ఆన్‌లైన్.. ఏదైనా
ఈ-ప్రగతి ప్రాజెక్టులో భాగంగా భూధార్ ప్రాజెక్టు తీసుకొచ్చారు. ఇది భూసేవలో భాగంగా అమలవుతోంది. ప్రతీ మనిషికి ఓ ఆధార్ నెంబర్ ఉన్నట్లే...భూమికి 11 అంకెల విశిష్ట సంఖ్యను జారీ చేస్తారు. దీన్ని భూధార్‌గా పిలుస్తున్నారు. రాష్ట్రంలోని 2.84 కోట్ల వ్యవసాయ భూములు, 0.32 కోట్ల పట్టణ ఆస్తులు, 0.84 కోట్ల గ్రామీణ ఆస్తులకు ఈ నంబర్ ఇస్తారు. తొలుత కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో ఈ ఏడాది ఏప్రిల్ 11న ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఇప్పుడు రాష్ట్రస్థాయిలో పూర్తిగా భూధార్ అమల్లోకి వచ్చింది. కాగా, భూధార్ కార్డులను రైతులు తమ సెల్‌ఫోన్ ద్వారా ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలను మొబైల్ భూధార్, ఈ-భూధార్‌గా పిలుస్తారు.
