Published: 20-11-2018
సీఎం అయ్యాక అన్నీ పరిష్కరిస్తా

ముఖ్యమంత్రి అయ్యాక సమస్యలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతానని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి ఎడమ మట్టికట్ట నుంచి సోమవారం ఉదయం 9గంటలకు ప్రజా సంకల్పయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన వివిధ ప్రాంతాల్లో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తూ మాట్లాడారు. నాలుగున్నరేళ్లుగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, కొంతకాలం ఓపికపడితే రామన్న రాజ్యం వస్తుందని, అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు. తాను గుర్తించిన, తన దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ సీఎం అయిన వెంటనే పరిష్కరిస్తానన్నారు. తితలీ తుఫాన్ బాధితులకు ఎకరానికి రూ.12వేలు మాత్రమే పరిహారం ఇచ్చారని జగన్‌కు పలువురు తెలిపారు. దీనిపై స్పందిస్తూ అధికారంలోకి రాగానే ఎకరాకు రూ.25వేలు చొప్పున పరిహారం అందిస్తామన్నారు.
