Published: 15-11-2018

‘గజ’ తుఫానుతో తూర్పనావికాదళం అప్రమత్తం

విశాఖపట్నం: ‘గజ’ తుపాను తీవ్రతరం కావడంతో తూర్పునావికాదళం అప్రమత్తమైంది. ఐఎన్ఎస్ రణ్‌వీర్, కంజార్ యుద్దనౌకలతో పాటు హెలికాప్టర్లు సిద్ధం చేసింది. బాధితులు, అత్యవసర వస్తువుల తరలింపునకు తూర్పు నావికాదళం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
 
తమిళనాడు తీరం దిశగా ‘గజ’ తుఫాన్‌ దూసుకొస్తోంది. ఈరోజు సాయంత్రం కడలూరు-పంబన్‌ మధ్య తీరం దాటనుంది. బుధవారం సాయంత్రానికి చెన్నైకు 430 కిలోమీటర్లు, నాగపట్నానికి 510 కిలోమీటర్ల దూరంలో నైరుతి, దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ నైరుతిగా పయనించి తొలుత తీవ్ర తుఫాన్‌గా, ఆ తర్వాత బలహీనపడి తుఫాన్‌గా మారుతుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అలలు ఎగిసిపడుతున్నాయి.
 
తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు, అప్పుడప్పుడు 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, తుఫాన్‌ తీరం దాటే సమయంలో గాలుల ఉధృతి పెరుగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.