Published: 03-11-2018

ప్రధాన సమస్యలు పక్కకే.. దాడిలో బాబు, జగన్‌ ప్రమేయం లేదు

వచ్చే ఎన్నికల్లో ప్రధాన సమస్యలన్నీ పక్కకు పోతాయి.. కోడి కత్తే ఎన్నికల ప్రచారాస్త్రమవుతుంది. జగన్‌పై జరిగిన దాడిపై రాజకీయ రాద్ధాంతం జరుగుతోంది. ఈ దాడిలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ప్రతిపక్ష నేత జగన్‌కు ప్రమేయం ఉందనుకోను... ఇంత రాద్ధాంతమెందుకు... నిందితుడికి నార్కో ఎనాలసిస్‌ పరీక్ష చేస్తే కుట్ర బయటకొస్తుంది’ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అన్నారు. కోడి కత్తితో పొడిపించుకుంటే ఎన్నికల్లో జగన్‌ పార్టీ నెగ్గుతుందనడం సరికాదన్నారు. ‘ఇది చిన్న సంఘటన. అలిపిరి దాడిలో చంద్రబాబు తీవ్రంగా గాయపడ్డారు. అయినా ఎన్నికల్లో ఓడిపోయారు.
 
మరి ఈ చిన్న సంఘటన చూసి జగన్‌కు ప్రజలు ఓట్లు ఎందుకు వేస్తారు’ అని ప్రశ్నించారు. టీడీపీ, కాంగ్రెస్‌ కలవడం వల్ల తెలంగాణలో టీడీపీకి, ఏపీలో కాంగ్రెస్‌కు మేలు జరుగుతుందని చెప్పారు. ‘చంద్రబాబు అవసరమనుకుంటే ఎవరితోనైనా కలుస్తారు. ఆయన, జగన్‌ కలిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎన్టీఆర్‌తో విభేదించిన తర్వాత చంద్రబాబు ఎప్పుడూ సొంతగా ఎన్నికలకు వెళ్లలేదు. మొదట వామపక్షాలతో కలిసి పోటీచేసి.. ఎన్నికల అనంతరం ఎన్డీఏతో కలిసి వాజ్‌పేయిని ప్రధానిని చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసినా.. ఎన్నికలయ్యాక పరిస్థితిని బట్టి.. మారిన మోదీ అంటూ ఆయనతో చేతులు కలపవచ్చు’ అని ఉండవల్లి వ్యాఖ్యానించారు.