సీఎంకు ‘ఈ వారం లేఖ’లో కన్నా

మహిళల అక్రమ రవాణాలో ఆంధ్రప్రదేశ్‌ను నంబర్ వన్ స్థానంలో ఉంచిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ప్రతి వారం ఐదు ప్రశ్నలతో ముఖ్యమంత్రికి లేఖ రాస్తున్న కన్నా బుధవారం తన 18వ లేఖను విడుదల చేశారు. దేశంలో అక్రమ రవాణాకు బలవుతోన్న మహిళల్లో 26శాతం మంది ఏపీ వారేనని జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదించిందని కన్నా గుర్తు చేశారు. ‘‘పోలవరం ప్రాజెక్టు ముంపు భూముల వ్యవహారంలో టీడీపీ నేతలు అక్రమంగా రూ.650 కోట్లు కాజేయలేదా? అమరావతి డిజైన్ల రూపకల్పన సంస్థ మార్పులో రూ.90కోట్ల ఒప్పందం వెనకున్న రహస్యమేంటి? అగ్రిగోల్డ్ వ్యవహారంలో దర్యాప్తు సంస్థలను కోర్టులు తప్పు పట్టలేదా? నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిధులు తీసుకుని తిత్లీకి కేంద్రం ఏమీ ఇవ్వలేదని ఆరోపించడం ఎంతవరకూ సబబు?’’ అంటూ కాన్నా తన లేఖలో చంద్రబాబుకు ప్రశ్నలను సంధించారు.
