Published: 26-10-2018
చంద్రబాబుకు వార్నింగ్.... జగన్‌కు ఏమైనా జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు’

‘చంద్రబాబుకు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం. జగన్‌కు ఏమైనా జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు’ అని వైసీపీ ఎమ్మెల్యే రోజా హెచ్చరించారు. దాడి చేయించిన వాళ్లెవరినీ వదిలేది లేదన్నారు. కత్తికి విషం పూశారేమో అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. దీని వెనక ఉన్నదెవరో తేలాలని డిమాండ్ చేశారు. పక్కా ప్రణాళికతోనే దాడికి దిగారని స్పష్టమవుతున్నట్లు ఆరోపించారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. దాడి వెనక ఎవరున్నారో ప్రభుత్వం తేల్చకపోతే తామే కనుక్కుంటామన్నారు. ఏపీలో ప్రతిపక్ష నేతకే రక్షణ లేదంటే సామాన్యులు ఎలా బతకాలని ఆమె ప్రశ్నించారు. జగన్‌కు వస్తున్న ప్రజాదరణను ఓర్వలేకనే దాడి చేయించారని, గతంలో కాంగ్రె్‌సతో కలిసి కేసులు బనాయించి జైలుపాలు చేశారని, చివరకు బరితెగించి టీడీపీయే దాడి చేయించిందని ఆరోపించారు.
‘అత్యంత భద్రత ఉన్న ఎయిర్‌పోర్టులో ఒక వెయిటర్ కత్తి తీసుకుని తిరుగుతుంటే వీళ్లు చేతులకు గాజులు తొడుక్కుని ఉన్నారా? ఎయిర్‌పోర్టులోకి వెళ్లాలంటే ఎన్నో రకాలుగా తనిఖీలు చేస్తారు. అయినా ఒక వ్యక్తి కత్తి తీసుకుని వెళ్లాడంటే.. అతడి వెనుక ఎవరున్నారు.. మద్దతిచ్చిందెవరు.. అతడిని ఉద్యోగంలో పెట్టించిందెవరు.. ఆ క్యాంటిన్ ఎవరిది? ఆ యువకుడు ఎందుకు దాడి చేశాడు? అనే విషయాలు తేలకపోతే పార్టీ ఆధర్యంలో ఆందోళన ఉధృతం చేస్తాం’ అని రోజా హెచ్చరించారు. వ్యవస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ‘నగరి జాతరలో నా మీద కూడా దాడి జరిగి.. చేయి తెగి రక్తం వచ్చింది. ఆ కేసునూ మూసేశారు. నాకు వన్ ప్లస్ వన్ గన్‌మెన్‌ను మాత్రమే ఇచ్చారు. ఒకరుంటే ఇంకొకరు ఉండరు’ అన్నారు.
