Published: 24-10-2018
తక్షణం కేంద్ర బృందాలు రావాలి

‘‘జగన్‌లాగానో, ఇతర ప్రతిపక్ష పార్టీల్లాగానో ఏ విధంగానైనా సరే ప్రభుత్వాన్ని విమర్శించాలనే ఉద్దేశం మాకు ఎప్పుడూ లేదు. తితలీ తుఫాను బాధితులను పూర్తిస్థాయిలో ఆదుకోవాలని మాత్రమే కోరుతున్నాను’’ అని జనసేన అధిపతి పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రభుత్వంపై విమర్శలు, అవినీతి ఆరోపణలు చేయడంలేదని.... ప్రభుత్వ సహాయ పునరావాస కార్యక్రమాలు పారదర్శకంగా ప్రతి ఒక్కరికీ అందించాలని మాత్రమే కోరుతున్నామని చెప్పారు. ఉత్తరాంధ్రను ఆదుకునేందుకు కేంద్రం సాయం చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో మంగళవారం ఆయన గవర్నర్‌ను కలిశారు. తితలీ తుఫాను నష్టంపై పార్టీ తరఫున రూపొందించిన నివేదికను అందచేశారు.
ఆ తర్వాత రాజ్‌భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. తుఫాను బాధితులను ఆదుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడాలని గవర్నర్‌ను కోరారు. తాను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానని.. కేంద్రంతోనూ సంప్రదింపులు జరుపుతానని పవన్‌కు నరసింహన్ హామీ ఇచ్చారు. పవన్ వెంట జనసేన ముఖ్య నేతలు నాదెండ్ల మనోహర్, మాదాసు గంగాధరం, తోట చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. తుఫాను ప్రభావిత ప్రాం తాల్లో తాను పర్యటించానని, మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ లేకపోవడంతో ప్రజలు చీకట్లోనే దసరా పండుగను చేసుకోవాల్సి వచ్చిందని గవర్నర్‌కు పవన్ తెలిపారు. నష్టాన్ని అంచనా వేసేందుకు తక్షణమే కేంద్రం బృందాన్ని పంపాలన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేయాలని పవన్ కోరారు.
కేంద్ర సహాయం కీలకం...
సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకుపోయామని, సాయం విషయంలో కేంద్రం ఎలా స్పందిస్తుందో తెలియదని పవన్ అన్నారు. ‘కేరళలో తుఫాను బాధితుల కష్టాలు ప్రపంచమంతటికీ తెలిశాయి. కానీ... ఉత్తరాంధ్రలో అలా జరగడంలేదనే ఆందోళన అక్కడి ప్రజల్లో ఉంది. అక్కడి ప్రజలు కోలుకోవాలంటే కనీసం 20 నుంచి 30 ఏళ్లు సమయం పడుతుంది. వాళ్లను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి’’ అని పవన్ కోరారు. తుఫాను బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రకటించిన సాయం ఇంకా అందలేదని, అందినా అది సరిపోయేలా కనిపించడంలేదని నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం తక్షణం పర్యటించాల్సిన అవసరం ఉందన్నారు.
