దాడులు... రాజకీయ కక్ష సాధింపులో భాగమే

‘‘పధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్... నలుగురూ దొంగలే’’ అని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. శనివారం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ‘‘ప్రజలను మభ్యపెట్టడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాడుల నాటకాలు ఆడుతున్నాయి. బీజేపీ, టీడీపీ నాలుగేళ్లు కాపురం చేశాయి. ఇప్పుడు విడాకులు తీసుకున్నాక ఐటీ దాడులు చేయడం వెనుక అంతర్యమేమిటో ప్రజలకు తెలుసు. ఐటీ దాడులు ‘రాజకీయ కక్ష సాధింపులో భాగమే’నని కాంగ్రెస్ అంటుంటే.. దాడులు చేస్తే తప్పేంటని జగన్ అనడం చాలా విడ్డూరంగా ఉంది. రూ.49 వేల కోట్ల రాఫెల్ కుంభకోణం జరిగితే జగన్, పవన్‌లు ఎందుకు ప్రశ్నించలేదు? అగ్రిగోల్డు సంస్థ మాదిరిగానే దేశంలో మరో సంస్థ పెరల్స్. ఐదున్నర కోట్ల మంది వద్ద రూ.49వేల కోట్లు దోచుకుంది. మున్సిపల్ కార్మికులు ఆందోళనలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవటం బాధాకరం’ అని అన్నారు.
