Published: 12-10-2018
జనసేన రహస్య సర్వే..

ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీల్లోనూ హడావుడి మొదలయ్యింది. అభ్యర్థుల ప్రాథమిక ఎంపికపై అధినేతలు దృష్టిపెట్టారు. టీడీపీ, వైసీపీలు అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుండగా, జనసేన పార్టీ కూడా ఆ వ్యవహారంలో మునిగిపోయింది. సంస్ధాగతంగా పెద్దగా బలంలేదు ఆ పార్టీకి. అందుకే, పార్టీలోకి వచ్చేవారు ఎవరు? ఏ పార్టీ నుంచి ఎంతమంది వస్తారు? అనే అంశాలపై సర్వే చేయిస్తోంది. అది కూడా ఎంతో రహస్యంగా! సర్వే చేసేవారు కూడా సాదాసీదా వ్యక్తులు కాదు. పోలీసుశాఖలో పనిచేసి రిటైరయిన కొంతమంది అధికారులు. ఈ రహస్య బృందం ఇప్పటికే కొందరి పేర్లతో ఒక నివేదికను రూపొందించి పార్టీ అధినేతకు అందజేసిందట. పూర్తిస్థాయి నివేదికను అందజేయడానికి కసరత్తు చేస్తోందన్నది జనసేన వర్గాల టాక్! ఇంతకీ ఈ సర్వే సంగతులేంటో, పవన్ మదిలో ఏముందో ఈ కధనంలో చూద్దాం.
వాయిస్:
ఒకప్పుడు స్వచ్ఛంద సంస్ధగా మొదలై ఆ తర్వాత రాజకీయ పార్టీగా అవతరించింది జనసేన! ఈ పరిణామం అంతటికీ నాలుగేళ్లపైనే సమయం పట్టింది. ఆ మధ్య వరకు క్రియాశీల రాజకీయాల్లో అంత చురుకుదనం ప్రదర్శించని జనసేన, గత ఏడాది నుంచి రూట్ మార్చింది. 2019 ఎన్నికల్లో పోటీచేయడమే లక్ష్యంగా పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక్కడే ఒక చిక్కొచ్చి పడిందట ఆయనకు. పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. సంస్థాగతంగా మాత్రం పెద్దగా బలంగా లేదు. ఆ సమస్యను అధిగమించడంతోపాటు వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున ఎవరిని రంగంలోకి దించాలనే అంశంపై ఆయన దృష్టి సారించారట. ఈ వ్యవహారాన్ని కూడా పశ్చిమగోదావరి జిల్లా నుంచే ప్రారంభించారట పవన్. ఇందుకోసం పెద్ద కసరత్తే పార్టీ తరఫున చేపట్టారట. ఎవరికి పడితే వారికి టిక్కెట్లు ఇవ్వదల్చుకోలేదట! వచ్చే ఎన్నికల్లో పార్టీ పక్షాన రంగంలోకి ఎవరిని దింపితే బాగుంటుంది? ఎవరయితే ఇతర పార్టీలకు గట్టి పోటీ ఇస్తారు? అనే అంశాల ఆధారంగా అభ్యర్ధులు ఎంపికకు బీజం వేశారట పవన్. అలా అని, ఆయన ఒక్కరే అభ్యర్ధుల ఎంపికను చేపట్టడం లేదట. అందుకు ఒక సర్వే టీమ్‌ను ఏర్పాటుచేశారట. ఆ బృందానికి నేతృత్వం వహిస్తున్న వ్యక్తులు మామూలు వారు కాదట. పోలీస్‌శాఖలో పనిచేసి రిటైరయిన ఒక డీఎస్‌పీ స్థాయి అధికారి నేతృత్వంలో కొంతమంది రిటైర్డ్ పోలీసు అధికారులు సభ్యులుగా ఆ బృందాన్ని ఏర్పాటుచేశారట. ఈ అంశంపైనే పశ్చిమలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
అభ్యర్థుల విషయంలో పవన్ ఇంత జాగ్రత్త తీసుకోవడానికి ఒక కారణం ఉంది. పవన్ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటుచేసినప్పుడు కొన్ని దెబ్బలు తిన్నమాట తెలిసిందే! గ్రాస్‌రూట్ లెవెల్లో పార్టీలో జరిగిన కొన్ని కీలకమైన విషయాలు, జిల్లాస్థాయిలో చోటుచేసుకున్న పరిణామాలను అప్పట్లో ప్రజారాజ్యం శ్రేణులు చిరంజీవి దృష్టికి తీసుకురాలేదట. దాంతోనే ఆ పార్టీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదని పవన్‌కల్యాణ్ భావిస్తున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఆ సమస్య ఇప్పుడు జనసేనలో పునరావృతం కాకుండా ఉండేందుకే పవన్ ఈ సర్వే బృందాన్ని ఏర్పాటుచేశారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
