Published: 09-10-2018

అధికారంలోకి వస్తే సమస్యలన్నీ పరిష్కారం

విజయనగరం జిల్లాలో సాగుతున్న పాదయాత్రలో భాగంగా వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సోమవారం ప్రజల విన్నపాలు వింటూ ముందుకు సాగారు. గుర్ల మండలం కలవచర్ల నుంచి ఉదయం నడక ప్రారంభించారు. మార్గమధ్యంలో పలు వర్గాలవారు తమ సమస్యలను విన్నవించారు. కోటగండ్రేడు గ్రామంలో కులవృత్తుదారులంతా రోడ్డుకు ఇరువైపులా స్టాళ్లు ఏర్పాటు చేశారు. వాటిని జగన్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు తమ సమస్యలను తెలియజేశారు. అనంతరం గీత కార్మికులు, యాదవులు, కుమ్మరి, జాలరి, రజకులు, వడ్రంగులు, విశ్వబ్రాహ్మణులు కూడా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. చేతివృత్తిదారులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, అధికారంలోకి వస్తే అందరి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అదే దారిలో అంగన్‌వాడీ కార్యకర్తలతోనూ మాట్లాడారు. బియ్యం, గుడ్లు, నాణ్యమైన సరుకులను ప్రభుత్వం సరఫరా చేస్తోందో లేదో అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి గరికివలస వెళ్లారు. కాగా.. జగన్‌ పాదయాత్ర జరుగుతుండగా ఆనందపురం వద్ద మద్యం సేవించిన ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు.