Published: 09-10-2018

రూ.3 వేలకే బ్యాంకాక్‌ ప్రయాణం...

విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వెళ్లాలంటే కేవలం గంట విమాన ప్రయాణం. విమాన సంస్థలు రూ.3,500 మొదలుకొని రూ.18వేల వరకు సమయాన్ని బట్టి చార్జీలు డిమాండ్‌ చేస్తున్నాయి. రోజుకు ఐదు విమానాలున్నా ఇదే డిమాండ్‌. విశాఖపట్నం ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బ్యాంకాక్‌ విమానం అందుబాటులోకి వచ్చింది. అతి తక్కువ ధరకు విమానాలకు నడిపే ఎయిర్‌ ఏసియా డిసెంబరు 7న బ్యాంకాక్‌ నుంచి విమానం నడుపుతోంది. 8న విశాఖ నుంచి బయల్దేరుతుంది.
 
వారానికి నాలుగు రోజులు ప్రతి సోమ, మంగళ, గురు, శనివారాల్లో నడుస్తుంది. ప్రారంభ ఆఫర్‌ కింద ఒకవైపు టిక్కెట్‌ ధర రూ.2,999గా నిర్ణయించారు. అంటే హైదరాబాద్‌ టిక్కెట్‌ కంటే తక్కువ. విశాఖ నుంచి నడిచే విమానాలన్నింటిలో(జగదల్‌పూర్‌ తప్ప) ఇదే తక్కువ ధరగా చెప్పుకోవచ్చు. అంటే దేశీయ ధర కంటే తక్కువకే విదేశీ యానం చేసే అవకాశం. దీనికి వీసా కూడా అవసరం లేదు. ఆరు నెలల గడువు కలిగిన పాస్‌పోర్టు, అందులో రెండు పేజీలు ఖాళీ వుంటే చాలు. ఎంచక్కా బ్యాంకాక్‌ ఎగిరిపోవచ్చు. మూడు గంటల ప్రయాణం. టిక్కెట్‌ బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి.