Published: 04-10-2018
బహుముఖ ప్రజ్ఞా ‘మూర్తి’ గీతం మూర్తి ఇకలేరు

విశాఖపట్నం,: తెలుగుదేశం పార్టీ నేతలను రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ, విద్యావేత్త, ‘గీతం’ సారథి ఎంవీవీఎస్ మూర్తి (80) కన్నుమూశారు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అలస్కా రాష్ట్రం క్యాంట్‌వెల్‌లో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో మూర్తితోపాటు అదే వాహనంలో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు మరణించారు. ఈనెల 6వ తేదీన కాలిఫోర్నియాలో జరగనున్న అమెరికాలోని గీతం పూర్వ విద్యార్థుల (గానం) సమ్మేళనంలో పాల్గొనేందుకు మూర్తి గత నెల 15న అమెరికాకు వెళ్లారు. ఆయనతోపాటు వీపీఆర్ చౌదరి అలియాస్ చిన్నా (మూర్తి వ్యక్తిగత కార్యదర్శి), కడియాల వెంకట రత్నం (గీతం బెంగళూరు ఫ్యాకల్టీ) కూడా అమెరికా వెళ్లారు. ‘గానం’ సదస్సుకు సమయం ఉండటంతో అమెరికాలో స్థిరపడిన మిత్రులు, బంధువులను మూర్తి కలుస్తున్నారు.
ఇదే క్రమంలో మూర్తి, వెంకటరత్నం, చిన్నా కలిసి... అమెరికాలోనే ఉంటున్న గీతం మేనేజింగ్ ట్రస్టీ వెలువోలు బసవ పున్నయ్య (78), వీరమాచినేని శివప్రసాద్ (గీతం పూర్వ అధ్యాపకుడు)తో పాటు ఫెయిర్ బ్యాంక్స్ సమీపంలోని ప్రఖ్యాత వన్యప్రాణి సంరక్షణ నిలయాన్ని సందర్శించేందుకు బయలుదేరారు. మంగళవారం కాలిఫోర్నియా నుంచి 2017 డాడ్జ్ వ్యాన్‌లో ఉల్లాసంగా కదిలారు. వాహనాన్ని శివప్రసాద్ నడుపుతున్నారు. పార్క్‌లేన్ హైవేపై వెళ్తూ... ముందు వస్తున్న ఓ భారీ వాణిజ్య వాహనాన్ని దాటేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న 2007 ఫోర్డ్ ఎఫ్-150 పికప్ ట్రక్కును బలంగా ఢీకొట్టారు. దీంతో మూర్తి, ఆయన మిత్రులు ప్రయాణిస్తున్న వాహనం నుజ్జుగా మారింది. ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం జరిగింది బాగా మారుమూల ప్రాంతం కావడంతో తక్షణ వైద్య సహాయం అందలేదు. పోలీసులు, వైద్య సిబ్బంది వచ్చేలోపు ఆ దారిలో వెళ్తున్న వారే సహాయ చర్యలు చేపట్టారు.
విహారయాత్ర కోసం టెక్సాస్ నుంచి ఫెయిర్ బ్యాంకుకు వచ్చిన ఇద్దరు నర్సులు సుమారు 40 నిమిషాలపాటు వైద్య సహాయం అందించారు. ఆ తర్వాత హెలికాప్టర్‌లో ముగ్గురు క్షతగాత్రులను యాంకరేజ్‌లోని ఆస్పత్రికి తరలించారు. అయితే... ఈలోపే మరో ఇద్దరు మరణించారు. ప్రస్తుతం కడియాల వెంకట రత్నం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మూర్తితోపాటు మరణించిన మిగిలిన ముగ్గురి భౌతిక కాయాలను అలస్కా స్టేట్ మెడికల్ ఎగ్జామినేషన్ సెంటర్‌లో భద్రపరిచారు.
ప్రమాద వార్త తెలిసిందిలా..
ఎంవీవీఎస్ మూర్తికి ఇద్దరు కుమారులు పట్టాభి రామారావు, లక్ష్మణరావు... కుమార్తె భారతి ఉన్నారు. వీరిలో రామారావు రాజమండ్రిలో, లక్ష్మణరావు హైదరాబాద్‌లో ఉంటున్నారు. భారతి తమిళనాడులోని కోయంబత్తూరులో స్థిరపడ్డారు. మూర్తి మనవలు సిద్ధార్థ్, భరద్వాజ్, మనవరాలు వర్షిణి అమెరికాలోనే ఉంటున్నారు. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు భరద్వాజ్ హైదరాబాద్‌లో ఉన్న తన తండ్రి లక్ష్మణరావుకు ఫోన్ చేసి ప్రమాద సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో మరణించిన బసవ పున్నయ్య గతంలో విశాఖలో పాత్రికేయుడిగా పని చేశారు.
శనివారం అంత్యక్రియలు!
మూర్తి భౌతికకాయం శుక్రవారం విశాఖ చేరుకునే అవకాశముందని... శనివారం అంత్యక్రియలు జరపాలని భావిస్తున్నారు. బుధవారం మూర్తి పెద్ద కుమారుడు రామారావుకు చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం విశాఖలోనే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన బాధ్యతలను విశాఖ జిల్లాకు మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులకు అప్పగించారు.
ట్రక్కులో వారి పరిస్థితీ విషమం
పార్క్‌లైన్ హైవేపై ప్రమాదం జరిగిన చోట ఓవర్‌టేక్ చేయడంపై నిషేధం అమలులో ఉంది. కానీ... ముందు వెళ్తున్న భారీ వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న పికప్ ట్రక్‌ను ఢీకొట్టారు. ఈ ట్రక్కును అమెరికా రక్షణ విభాగంలో పని చేస్తున్న కొలిన్(23) నడుపుతున్నారు. భార్య ఫెలిసియా (21), రెండేళ్ల కుమారుడితో కలిసి ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో వీరంతా తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనలో కొలిన్ తప్పేమీ లేదని ఫెయిర్‌బ్యాంక్స్ పోలీసు విభాగం అధికార ప్రతినిధి ప్రకటించారు.
