Published: 04-10-2018
శబరిమలలో మహిళల్ని ఎవరూ అడ్డుకోలేరు

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయబోమని కేరళ ప్రభుత్వం స్పష్టంచేసింది. ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) కూడా ఇదే మాట చెప్పింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘రాబోయే సీజన్‌లో శబరిమలలో మహిళా భక్తులకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తాం’’ అని స్పష్టం చేశారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో శబరిమలకు అధిక సంఖ్యలో మహిళలు వస్తారని తాము భావించడం లేదన్న టీడీబీ అధ్యక్షుడు ఎ.పద్మకుమార్ వ్యాఖ్యలను సీఎం పరిగణనలోకి తీసుకోలేదు. తీర్పును వ్యతిరేకిస్తూ కేరళలో మంగళవారం వేల మంది అయ్యప్ప భక్తులు, మహిళలు చేపట్టిన నిరసనలపై విజయన్ స్పందిస్తూ.. అయ్యప్ప ఆలయానికి వెళ్లి పూజలు చేయాలనుకునే మహిళలను ఆపే హక్కు ఏ ఒక్కరికీ లేదని చెప్పారు.
సుప్రీం తీర్పును ప్రజలు అంగీకరించాల్సిందేనని, ప్రభుత్వం ఉన్నది ఆ తీర్పును అ మలు చేసేందుకేనన్నారు. మరోవైపు టీడీబీ అధ్యక్షుడు ఎ.పద్మకుమార్ కూడా.. ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పును జాగ్రత్తగా పరిశీలించిన అనంతరం రివ్యూ పిటిషన్ వేయరాదని నిర్ణయించినట్లు చెప్పారు. కాగా, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు శబరిమల ఆలయ ఆచారాలు, విశ్వాసాలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరాయి. భక్తుల మనోభావాల్ని కూడా పరి గణనలోకి తీసుకోవాలని సంఘ్ ప్రధాన కార్యదర్శి సురేశ్ భయ్యాజీ జోషి సూచిం చారు. ‘‘దీనిపై అన్నివర్గాలూ కలిసి ఓ పరిష్కార మార్గం వెతకాలి. న్యాయపరమైన ప్రత్యామ్నాయాలనూ పరిశీలించాలి. భక్తుల మనోగతాన్ని విస్మరించరాదు’’ అన్నారు.
