ఈ-ఫార్మసీ విధానాన్ని మెడికల్ షాపుల యజమానులు వ్యతిరేకిస్తున్నారు

విజయవాడ: ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలకు సంబంధించిన ఈ-ఫార్మసీ విధానాన్ని మెడికల్ షాపుల యజమానులు వ్యతిరేకిస్తున్నారు. ఈ తరహా వ్యాపారానికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం డ్రగ్ అండ్ కాస్మొటిక్ యాక్ట్ (1940)లో మార్పులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానాన్ని నిరసిస్తూ ఈనెల 20 నుంచి మెడికల్ షాపుల నిర్వాహకులంతా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా, దేశవ్యాప్తంగా ఔషధ వ్యాపారంలో ఉన్న 8లక్షల మంది కెమి్‌స్టలు, వారిపై ఆధారపడిన 80లక్షల మంది ఉద్యోగుల జీవనోపాధిపై ప్రభావం చూపే ఈ-ఫార్మసీ విధానాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్‌కు ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ పిలుపునిచ్చింది. దీనిపై సీమాంధ్ర డ్రగ్ డీలర్స్ అసోసియేషన్, కృష్ణాజిల్లా డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరపత్రాలు, వాల్‌పోస్టర్లు ముద్రించి ప్రచారం చేస్తున్నారు. బంద్ నేపథ్యంలో ఎక్కడా ఒక్క మెడికల్ షాపు తెరవడానికి అనుమతి లేదని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అత్యవసరంగా మందులు అవసరమైతే ఫోన్‌లో సమాచారం ఇచ్చినా సరఫరా చేస్తామని కృష్ణాజిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.ఎస్.పట్నాయక్ తెలిపారు. వెబ్‌సైట్ల నుంచి తీసుకున్న మందులు వికటించి రోగి మరణిస్తే దానికి ఎవరు బాఽధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
