Published: 26-09-2018
ఇదే జనసేన లక్ష్యం

సామాన్యుడు రాజ్యమేలాలనేదే జనసేన లక్ష్యమని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గెలుపు లక్ష్యం కాదు.. ఆ లక్ష్యం దిశగా వెళ్తూ సమాజంలో మార్పు, చైతన్యం తీసుకురావాలని కార్యకర్తలకు పిలుపిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో బస చేసిన ఆయన మంగళవారం వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులతో నేరుగా భేటీ అయ్యారు. వారికి పార్టీ లక్ష్యాలను వివరించారు. ‘రాజకీయమంతా అవినీతి, దోపిడీ వ్యవస్థతో నిండిపోయింది. వేల కోట్లతో ముడిపడిన వ్యవహారంలా మారింది.
ఈ అవినీతికి ఎక్కడో ఒక చోట గండి పడాలి. ఆటోవాలాలను వేధిస్తున్నారంటే అందుకు కారణం కూడా అవినీతే. అలాంటి అవినీతికి జనసేన దూరంగా ఉంటుంది. ఎవరి వద్దో డబ్బు తీసుకుని పోరాటం చేయలేను. ఎవరికి వారు స్వచ్ఛందంగా వ్యవహరిస్తే స్వీకరిస్తాం’ అని పవన్ తెలిపారు. పార్టీని నడపడం ఎంతో కష్టసాధ్యమైన పని అని తనకు తెలుసన్నారు. ‘పార్టీ వ్యవస్థలో దోపిడీ చేసే ఎమ్మెల్యేలు, ఇబ్బందులు పెట్టే ఎమ్మెల్యేలు ఉంటారు. వారిని ఎదుర్కోవాలంటే ఎవరిని పడితే వారిని పెడితే కుదరదు. నా బంధువులనో, కుటుంబ సభ్యులనో పెట్టి నిర్మాణం చేయడం చాలా తేలికైన పని. కానీ మీ నుంచి నాయకులను తయారు చేయాలనేదే జనసేన లక్ష్యం. నేను అదిచేస్తా, ఇది చేస్తానని హామీలు ఇవ్వను. ఆటో డ్రైవర్లకు బ్యాటరీ ఆటోలు తెచ్చే ఏర్పాటు చేస్తా’ అన్నారు.
మీరు చూస్తారా.. లేదా?
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యవహార శైలిని పవన్ తీవ్రంగా తప్పుపట్టారు. ‘టీడీపీకి గత ఎన్నికల్లో మద్దతిచ్చినప్పుడు.. శాంతిభద్రతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తారనుకున్నాను. దెందులూరు ఎమ్మెల్యే విషయంలో సీఎం ఉదాసీనంగా వ్యవహరించడం ఏ మాత్రం సరికాదు. ఆయనను క్రమశిక్షణలో పెడతారా లేక క్షేత్ర స్థాయిలో ప్రజలనే నిర్ణయం తీసుకోమంటారా? అనుభవం ఉన్న నాయకులని మీకు మద్దతిస్తే.. దోపిడీ చేసే నాయకులకు మీరు కొమ్ము కాస్తున్నారు’ అని చంద్రబాబును విమర్శించారు. కాగా, మతానికో రూలు సరికాదన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేందుకు జనసేన క్రైస్తవులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ‘క్రిస్టియానిటీ అందరి దృష్టిలో ఒక మతం కావచ్చు. నాకు మాత్రం బాధ్యత. విదేశాల నుంచి వచ్చిన క్రైస్తవం ఇంతమంది మనసులను గెలుచుకుందంటే అందుకు కారణం అందులోని సేవా దృక్పథమే. నా ఇద్దరు బిడ్డల్ని దేవుడు క్రిస్టియన్లుగా పుట్టించాడు’ అని వ్యాఖ్యానించారు.
