Published: 22-09-2018
మొబైల్ నంబర్ సంధానంలో ఇబ్బంది నెమ్మదించిన దరఖాస్తుల నమోదు

‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకానికి ఆధార్ సమస్య తలెత్తింది. దీంతో తొలిరోజు వెల్లువెత్తిన దరఖాస్తులు ఆ తర్వాతి నుంచి కాస్త నెమ్మదించాయి. మొదటి రోజు దాదాపు 90 వేలమంది వెబ్‌సైట్‌కు లాగిన్ కావడంతో ఒక దశలో సర్వర్ కూడా డౌన్ అయింది. వెంటనే సరిదిద్ది మళ్లీ నమోదు ప్రక్రియను పునరుద్ధరించారు. వెబ్‌సైట్‌ను సాంకేతికంగా పటిష్ఠంగా.. అందరికీ అర్థమయ్యేలా, ఫిర్యాదులతో సహా అన్నిటికీ అవకాశం ఇస్తూ, పారదర్శకంగా తయారుచేసిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. అయినా నమోదు నెమ్మదించడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారికి ఆధార్ అనుసంధానం సమస్యగా మారింది. ఆధార్ వివరాల్లో వారివద్దనున్న మొబైల్ నంబరు అనుసంధానం కాకపోవడంతో.. ఆ పని మళ్లీ చేసుకోవలసి వస్తోంది. అదే సమయంలో రాష్ట్రంలో డిగ్రీ చదివిన వారి వివరాలు ముఖ్యమంత్రి యువనేస్తం వెబ్‌సైట్‌తో అనుసంధానించారు. ఆ వెబ్‌సైట్‌లో దరఖాస్తుదారు ఆధార్ నంబరు ఎంటర్ చేయగానే...అతని విద్యార్హతలు కూడా వచ్చేయాలి.
ఆధార్‌తో అతడి విద్యార్హత అనుసంధానమై ఉంటే అదే జరిగేది. అయితే పలువురు గ్రాడ్యుయేట్లు తమ విద్యార్హతలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోలేదు. ఉదాహరణకు 2001 నుంచి 2018 వరకు రాష్ట్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారి వివరాలన్నీ ముందస్తుగానే వెబ్‌సైట్‌కు అనుసంధానించారు. అయితే ఆధార్ ప్రాధాన్యం ఐదారేళ్ల నుంచే ఎక్కువైంది. అంతకుముందు డిగ్రీ చేసినవారు.. తమ సర్టిఫికెట్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోలేదు. అలాంటివారు ముఖ్యమంత్రి యువనేస్తంలో దరఖాస్తుకు ఎంటర్ అయి... ఆధార్ నంబర్ ఎంటర్ చేసినా... అతడు గ్రాడ్యుయేషన్ చేసినట్లు చూపించడం లేదు. అయితే అలాంటి వారికి తక్షణమే అక్కడే వెబ్‌సైట్‌లోనే గ్రీవెన్స్ ఆప్షన్‌ను ఇచ్చారు. దానిలో ఎంటర్ అయి.. గ్రాడ్యుయేషన్ పత్రాన్ని అప్‌లోడ్ చేస్తున్నారు. ఆ గ్రాడ్యుయేషన్ పత్రం ఏ విశ్వవిద్యాలయానిదైతే దానికి ఆ గ్రీవెన్స్ వెళ్లిపోతుంది. సదరు విశ్వవిద్యాలయం ఆ గ్రీవెన్స్‌ను పరిశీలించి.. ఆ పత్రం నిజమైందో లేదో చెప్పాలి. నిజమేనని చెబితే అతడిని అర్హుడిగా నిర్ణయిస్తారు. ఈ ప్రక్రియకు వారం రోజుల సమయం పడుతోంది. ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులు సుమారు 26 వేలు ఉండగా...అందులో 15వేలు విద్యార్హతకు సంబంధించినవే. వివిధ విశ్వవిద్యాలయాల వద్ద ఇలాంటి గ్రీవెన్సులు 15 వేల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. కాగా.. ఈ వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించి వారం రోజులైంది. ఇప్పటివరకు సుమారు 2.9లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో సుమారు 74 వేల మంది అర్హత సాధించారు.
ఒకరోజులో ఎందరు దరఖాస్తు చేసినా..
యువనేస్తం పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు మరో 9రోజులు మాత్రమే ఉంది. ఒక రోజులో ఎంతమంది దరఖాస్తు చేసుకున్నా సాంకేతికంగా ఇబ్బంది లేకుండా వెబ్‌సైట్‌ను రూపొందించారు. అన్ని వివరాలతో దరఖాస్తు చేసుకున్నవారికి అర్హత ఉంటే అక్కడికక్కడే ఎంపిక అయినట్లు చూపిస్తోంది. ఒకవేళ ఫిర్యాదులున్నా ఆ వెబ్‌సైట్‌లోనే ఎంటర్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. నిరుద్యోగ భృతి ఒక్కటే కాకుండా.. ఆ అభ్యర్థికి నచ్చిన రంగంలో నైపుణ్యాల శిక్షణ కూడా ఇవ్వనున్నారు. అదే సమయంలో తమ కంపెనీల్లో ఉద్యోగాల కోసం అభ్యర్థులు కావాలనుకునే వారి కోసం పలు కంపెనీలు ఈ వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోనున్నాయి. దీంతో యువతకు ఈ నమోదు కీలకం కానుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
