Published: 22-09-2018
రాష్ట్రంలో పర్యటిస్తాం.. పెట్టుబడులు పెడతాం

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు(పీసీబీ) తయారీ కంపెనీ ‘ఎవరీ’ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచింది. చైనా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ షెన్‌జెన్‌లోని ‘ఎవరీ’ కంపెనీని సందర్శించారు. ఆ కంపెనీ చైర్మన్ చార్లె్‌సతో భేటీ అయ్యారు. స్టార్టప్ రాష్ట్రంగా అభివృద్ధిలో ఏపీ ఏ విధంగా పరుగులు పెడుతుందో ఆయనకు లోకేశ్ వివరించారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినె్‌సలో నంబరు వన్‌గా ఉన్నాం. పరిశ్రమలు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో వరుసగా రెండోసారి నంబరు వన్ స్థానాన్ని పదిలపరుచుకొన్నాం. దేశంలో విద్యుత్ చార్జీలు పెంచబోమని ప్రకటించిన ఒకే ఒక రాష్ట్రం ఏపీ’ అని లోకేశ్ పేర్కొన్నారు. సమయం వృథా చేయకుండా.. ఒప్పందం చేసుకొన్న వెంటనే అన్ని అనుమతులు ఇస్తామని చెప్పారు. ‘భారత్‌లో మార్కెట్ పెరుగుతోంది. మీ దేశంలో పెట్టుబడులు పెట్టే ఆలోచన ఉంది’ అని ఎవరీ చైర్మన్ చార్లెస్ ఈ సందర్భంగా బదులిచ్చారు. ‘మీ రాష్ట్రం విజన్ నచ్చింది. త్వరలోనే మా బృందం ఏపీకి వస్తుంది. అక్కడ పర్యటించి పరిస్థితులు అంచనా వేసుకొని ఒక నిర్ణయానికి వస్తాం’ అని ఆయన హామీ ఇచ్చారు.
వేగంగా అనుమతులు
ఏఏసీ టెక్నాలజీస్ ఉపాధ్యక్షుడు కిమ్ చుల్, బొమిన్ ఎలక్ట్రానిక్స్ అసిస్టెంట్ ప్రెసిడెంట్ జింజర్ సూ, డబ్ల్యూయూఎస్ ప్రింటెడ్ సర్క్యూట్ కంపెనీ ప్రెసిడెంట్ క్రిస్ వూ, ఎస్జీసీ కంపెనీ చైర్మన్ మార్క్ జాంగ్, ఎస్వై టెక్ డైరక్టర్ చెన్, వివో కంపెనీ అధ్యక్షుడు షేన్ వెయ్ తదితరులతోనూ లోకేశ్ భేటీ అయ్యారు. ఎలకా్ట్రనిక్స్ తయారీ రంగ అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రాయితీలు, 24 గంటల విద్యుత్, మౌలిక వసతులు కల్పిస్తున్నామని, నైపుణ్యం కలిగిన యువత ఉందని మంత్రి వివరించారు. ఫాక్స్‌కాన్, సెల్‌కాన్, కార్బన్, డిక్సన్‌లు తమ కార్యకలాపాలు ప్రారంభించాయని, ఫ్లెక్స్‌ట్రానిక్స్, హోలీ టెక్, రిలయన్స్ జియో త్వరలోనే పనులు ప్రారంభించబోతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో వంద పారిశ్రామిక నగరాలు ఏర్పాటుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఏపీకి వచ్చి తమ దగ్గరున్న మూడు ఎలకా్ట్రనిక్స్ క్లస్టర్లు చూసిన తర్వాత పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలన్నారు. త్వరలోనే హాంకాంగ్ నుంచి తిరుపతికి డైరెక్ట్ విమానం ఏర్పాటు చేస్తున్నట్లు లోకేశ్ వెల్లడించారు.
యువతకు నైపుణ్య శిక్షణ
ఏపీ ప్రభుత్వం, ఇండియన్ సెల్యులార్-ఎలకా్ట్రనిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వర్క్‌షాప్‌లోనూ మంత్రి లోకేశ్ ప్రసంగించారు. కంపెనీలకు కావాల్సిన విధంగా యువతకు శిక్షణ ఇచ్చి వెంటనే ఉద్యోగాల్లో చేరే విధంగా సిద్ధం చేస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. రిలయన్స్ జియో త్వరలోనే తిరుపతిలో 130 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ పార్కు ఏర్పాటు చేస్తుందన్నారు. ఏపీకి వస్తే కేవలం 21రోజుల్లోనే అనుమతులు, 8 నెలల్లో కంపెనీ ఏర్పాటుకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామన్నారు. మంత్రి వెంట రాష్ట్ర ఐటీ కార్యదర్శి విజయానంద్ తదితరులు పాల్గొన్నారు.
