Published: 20-09-2018
మందుబాబులకు బ్రేకులు వేస్తున్న ‘ఆల్కాలాక్స్’

బెంగళూరులోని ఓ మల్టీ నేషనల్ సంస్థలో 16 ఏళ్లు పనిచేసిన మండలి రామనాథ్ అనే ఉద్యోగి ఆరు నెలల క్రితం ఈ ఆల్కాలాక్స్‌కు రూపకల్పన చేశారు. విజయవాడ కేంద్రంగా ఆవిర్భవించిన ఈ స్టార్టప్ సంస్థ ప్రతిభను ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ ఇటీవలే గుర్తించింది. ఇప్పటికే పలు రవాణా వ్యవస్థల నుంచి ఆదరణ లభిస్తోన్న ఈ సంస్థ ఇటీవలే ఏపీఎ్‌సఆర్టీసీతో కూడా ఒప్పందాలు కుదుర్చుకుంది.
ఇదీ ప్రత్యేకత?
తప్పతాగిన డ్రైవర్ల నిర్లక్ష్యంతో వాహన ప్రమాదాలు రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతున్నాయి. మద్యం మత్తులో జరుగుతున్న ప్రమాదాలే 60 శాతం వరకూ ఉంటాయని అంచనా. ఇలాంటి ప్రమాదాలను నివారించాలన్న సదుద్దేశంతో ఏర్పడిందే ఆల్కాలాక్స్ సంస్థ! విజయవాడలోని అయోధ్యనగర్‌లో నివాసముంటున్న రామనాథ్ ఆలోచనా శక్తికి కొందరు యువకుల మేధస్సు తోడైంది. దీంతో స్టార్టప్ సంస్థకు పునాది పడింది. వీరు రూపొందించిన బ్లోయర్, సెన్సార్లతో కూడిన ఓ డివైజ్‌ను వాహనానికి బిగించాలి. వాహనం స్టార్ట్ చేసే సమయంలో వాహనదారుడు ఆ బ్లోయర్ వద్ద ఊదాల్సి ఉంటుంది. ఇలా ఊదినప్పుడు డ్రైవరు తాగి ఉన్నట్లయితే వెంటనే ఆ సమాచారాన్ని డివైజ్‌కు అనుసంధానించిన ఫోన్‌కు పంపుతుంది. ఈ సమాచారం విశ్లేషణను తెలిపేలా ఈ డివైజ్‌లో మూడు రంగులు ఉంటాయి.
వాహనం స్టార్ట్ అవ్వకముందు ఆరంజ్ రంగులో లైటు వెలుగుతూ ఉంటుంది. వాహనం స్టార్ట్ చేసే ముందు డ్రైవరు బ్లోయర్‌ను ఊదాక సదరు వ్యక్తి మద్యం తాగి ఉంటే రెడ్ లైట్ వెలగడంతో పాటు ఆ వ్యక్తి ఎంత మొత్తంలో తాగాడు, ఆ వాహనం నంబరు ఏంటో ఆ డివైజ్‌కు అనుసంధానించిన ఫోన్‌కు సమాచారం వెళ్తుంది. తద్వారా డ్రైవరు తాగి డ్రైవింగ్‌కు సిద్ధపడుతున్నాడన్న విషయం ఆ వాహన యజమానికి తెలిసిపోతుంది. ఆ డివైజ్ వద్ద అమర్చిన కెమెరా ఆధారంగా ఎవరు డ్రైవింగ్ చేయబోతున్నారన్న సమాచారం కూడా తెలిసిపోతుంది. తాగి ఉన్న వ్యక్తికి బదులుగా మామూలు స్థితిలో ఉన్న వ్యక్తి బ్లోయర్ వద్ద ఊది, డ్రైవింగ్ మాత్రం మద్యం తాగిన వ్యక్తి చేయాలనుకున్నపుడు డివైజ్‌కు ఉన్న కెమెరా ద్వారా ఈ విషయాన్ని గుర్తించవచ్చు. దీంతో బ్లోయర్ ఊదని వ్యక్తి వాహనం స్టార్ట్ చేయాలని ప్రయత్నించినా ఇంజన్ అన్‌లాక్ అవ్వదు.
పెరుగుతున్న ఆదరణ
రామ్‌నాథ్ ప్రవేశపెట్టిన ఈ డివైజ్‌ను పరిశీలించిన పలు ప్రైవేటు, ప్రభుత్వ శాఖలు ఆల్కాలాక్స్ సేవలను ఉపయోగించుకుంటున్నాయి. ఇప్పటికే విజయవాడలో ఆల్కాలాక్స్ సంస్థకు చెందిన రెండుకార్లు తిరుగుతుండగా.. మార్నింగ్ స్టార్, ఎస్‌ఆర్‌ఎస్ అనే ప్రైవేట్ బస్సులకు, పలు కార్ రెంటల్ సర్వీసె్‌సకు రామ్‌నాథ్ తన డివైజ్‌లను అమర్చారు. అద్భుత ఫలితాలు ఇస్తోన్న ఈ డివైజ్ గురించి తెలుసుకున్న ఏపీఎ్‌సఆర్టీసీ కూడా సంస్థ బస్సులకు అమర్చాలని సంకల్పించింది. ఇప్పటికే చర్చలు పూర్తికాగా.. త్వరలో మూడు డీలక్స్ బస్సులకు ఈ డివైజ్‌లు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమవుతోంది. అలాగే పాఠశాలలు, కళాశాలల బస్సులకు కూడా ఈ డివైజ్‌ను ఏర్పాటుచేయడాకి ఆ సంస్థ తీవ్రంగా కృషి చేస్తోంది. అయితే ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం రామ్‌నాథ్ అండ్ కో తీవ్రంగా కృషి చేస్తోంది.
ప్రజోపయోగంపైనే నా దృష్టి
దాదాపు మూడు కంపెనీల్లో 16 ఏళ్లు ఉద్యోగం చేశాను. కానీ ఉద్యోగంలో కంటే ప్రజలకు ఉపయోగపడే ఏదైనా సాంకేతిక సంస్థ ఏర్పాటుపైనే నా ఆలోచన ఉండేది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆల్కాలాక్స్‌ను ప్రారంభించాను. నాతో పాటు చేబ్రోలులోని సెయింట్ మేరీస్, ఇతర కళాశాలల్లో బీటెక్ ఎలక్ర్టానిక్స్ చేసిన విద్యార్థులను కలుపుకొని ఈ సంస్థకు శ్రీకారం చుట్టాను. మా కృషితో పాటు ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహం అందితే రాష్ట్రంలోని స్టార్టప్ కంపెనీగా ఇతర రాష్ట్రాల్లోనూ సత్తా చాటగల ప్రతిభ మాకుంది.
