Published: 15-09-2018

సొంత జిల్లాలో మళ్లీ వైఎస్ జగన్ పాదయాత్ర

కడప: 2014 ఎన్నికల తరువాత పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అధినేత జగన్‌ ఆలోచన చేశారు. ఇందులో భాగంగా ‘గడప గడపకూ వైసీపీ’ అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టేలా 2016 జూన్‌లో నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీలు పార్టీ ముఖ్యనేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల్లోకి తీసుకె ళ్లాలి. తొమ్మిది హామీలపై నవరత్నాలు పేరుతో అధికారంలోకి వస్తే వాటిని ప్రజలకు అందిస్తామని ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రైతుకు భరోసా, వైఎ్‌సఆర్‌ ఆసరా, పెన్షన్ల పెంపు, అమ్మ ఒడి, పేదలకు పక్కా ఇళ్లు, ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంటు, జలయజ్ఞం, మద్యనిషేధం వీటినే నవరత్నాలుగా గడప గడపకూ వైసీపీ కార్యక్రమంలో పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. చాలా నియోజకవర్గాల్లో 70 శాతం కూడా ఈ కార్యక్రమం నేతలు పూర్తి చేయలేకపోయారు. కార్యక్రమాల నిర్వహణ, వ్యయంపైనే సందిగ్ధత కొనసాగుతూ ఏడాదికే ఈ కార్యక్రమం ముగింపు పలికే పరిస్థితులు ఏర్పడ్డాయి.
 
 
ఇంతలో జగన్‌ 2017 నవంబరు 6న ఇడుపులపాయ నుంచి పాదయాత్ర చేపట్టి నవంబరు 5 వరకు కొనసాగించేలా ఆ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. రెండురోజుల క్రితం వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో మళ్లీ ప్రజల్లోకి వెళ్లేలా కీలక నిర్ణయం తీసుకుని ఈసారి నవరత్నాలతో గడప గడపకూ అనే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఈనెల 17 నుంచి మొదలుబెట్టి జనవరి వరకు మొదటి దశ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సి ఉంది. రోజుకు రెండు బూత్‌ కమిటీల్లో ప్రతి ఇంటికీ వెళ్లి నవరత్నాల అమలు వల్ల జరిగే ప్రయోజనాలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేలా ఈ కార్యకమ్రం పెద్ద ఎత్తున చేపట్టాలని అధినేత జగన్‌ పార్టీ కేడరును కోరారు. రెండేళ్ల క్రితం మొదలు పెట్టిన గడప గడపకూ వైసీపీ తరహాలోనే ఈ కార్యక్రమం కూడా ఉంటుందని పార్టీకి చెందిన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేలా చూడాలని ఆదేశించారు.
 
 
ఇది ఎన్నికల ప్రచారం
2016లో పార్టీ బలోపేతానికి వైసీపీ చేపట్టిన గడప గడపకూ కార్యక్రమం పూర్తి స్థాయిలో జరగలేదు. దీనికి కారణాలు అనేకం. నిర్వహణ భారం మోయలేక కొందరు ఈ కార్యక్రమాన్ని మధ్యలోనే వదిలేశారు. గడప గడపకూ కార్యక్రమం నిర్వహించాలంటే రోజూవారీ ఖర్చులు తడిసి మోపెడవుతుండడం, ప్రజల నుంచి కూడా పెద్దగా స్పందన లేకపోవడం వంటివి పరిగణలోకి తీసుకుని తాత్కాలికంగా ఏడాది క్రితమే విరామం ఇచ్చారు. అందుకనే జగన్‌ పాదయాత్ర చేపట్టి నేరుగా ప్రజలతో మమేకమయ్యేలా నిర్ణయం తీసుకుని 2017 నవంబరు 6న ఇడుపులపాయలో ఈ కార్యక్రమం చేపట్టి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించారు. జిల్లాలోని రాజంపేట, కోడూరు, కడప, రాయచోటి, బద్వేలు నియోజకవర్గాల్లో జగన్‌ పాదయాత్ర జరగలేదు. ముందు అనుకున్న షెడ్యూలు ప్రకారం నవంబరు 5వ తేదీన జగన్‌ పాదయాత్ర ముగింపు పలికే అవకాశం ఉన్నట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అదే నెలలో జిల్లాలో కూడా రెండవ విడత బస్సు యాత్రలో ఈ ఐదు నియోజకవర్గాలలో జగన్‌ పర్యటిస్తారని ఆ పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. జనవరి నుంచి ఎన్నికల సందడి మొదలవుతున్న నేపధ్యంలో గడప గడపకూ నవరత్నాలు కార్యక్రమం ఎన్నికల ప్రచారంలా చేపట్టాలని పార్టీ నేతలు భావిస్తున్నారు.