Published: 07-09-2018

సభకు రాకుండా జీతభత్యాలు ఎందుకు

అమరావతి: సభకు ప్రతిపక్షం రాకపోవడం ప్రజల తీర్పును అగౌరవపర్చినట్టే అని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. శాసనసభలో మంత్రి మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలు సభకు రాకుండా జీత, భత్యాలు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. జీత, భత్యాలపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై ఎందుకు లేదని నిలదీశారు. ప్రతిపక్షం లేకపోయినా ప్రజా సమస్యలను అధికార పార్టీ సభ్యులే లేవనెత్తుతున్నారని, ఆ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరిస్తోందని మంత్రి తెలిపారు. ప్రతిపక్షం పాత్రను కూడా తామే పోషిస్తున్నామన్నారు. ప్రతిపక్షం అసెంబ్లీకి రావాలని ప్రభుత్వం తరపున ఎన్నోసార్లు కోరామని, అయినా విపక్షం స్పందించలేదని మంత్రి యనమల తెలిపారు.