రైల్వే పిలుపునకు అనూహ్య స్పందన

విజయవాడ: రండి... కేరళ వరద బాధితులకు సహాయం చేద్దాం... మాతో చేతులు కలపండి అని, దక్షిణ మధ్య రైల్వే ఇచ్చిన పిలుపునకు దాతల నుంచి అనూహ్య స్పందన లభించింది. జోన్ పరిధిలోని విజయవాడ డివిజన్‌తో పాటు మిగతా ఐదు డివిజన్‌ల నుంచి ఇప్పటి వరకు 520 టన్నుల వస్తు, ఆహార సామగ్రిని ఉచి తంగా కేరళకు రవాణా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ వెల్లడించారు. 75 టన్నుల బియ్యం, ఐదు టన్నుల గోధుమ పిండి, 9 టన్నుల పప్పు, చక్కెర, ఉప్పు, బెల్లం, వంట నూనె, స్నాక్స్, వాటర్ బాటిళ్లు, బిస్కెట్లు, పచ్చళ్లు, కూరగాయలు తదితర వస్తువులు దాతలు అందజేశారు. విజయవాడతో పాటు, సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, గుంతకల్, కడప, తిరుపతి, అనంతపురం, కర్నూలు, నాందేడ్ ప్రాంతాల్లోని రైల్వే పార్శిల్ కార్యాలయాలలో దాత లు అందజేసే వస్తు సామగ్రి కోసం ప్రత్యేకంగా కౌంటర్‌లు కూడా ఏర్పాటు చేశారు. దాతలు ముందుకు వస్తే తాము ప్రత్యేక పార్శిల్ లో వస్తుసామగ్రిని కేరళకు పంపించటానికి సిద్ధమన్నారు.
