Published: 27-08-2018
శాకాహార ప్రియులకు షాకింగ్ న్యూస్..

విజయవాడ: ఇటీవల ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలు ఉద్యానవన పంటలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఈ ప్రభావం మార్కెట్లపై తీవ్రంగా చూపుతోంది. ఫలితంగా కూరగాయల కోసం వెళ్లిన వినియోగదారుల పర్సులు ఖాళీ అవుతున్నాయి. సాధారణంగా ఇళ్లలో ఎక్కువగా వండే పొట్లకాయ, బెండ, దొండ, బీరకాయలకు ఇప్పుడు మార్కెట్లలో కొరత అధికంగా ఉంది. పంటలు నష్టపోవడంతో మార్కెట్‌కు సరుకు తగ్గుముఖం పట్టింది. సరుకు తగ్గిపోవడం, డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఈ నాలుగు కూరగాయల ధరలు దారుణంగా పెరిగిపోయాయి.
ఇవన్నీ జిల్లాలోని పెనమలూరు, ఉయ్యూరు, మైలవరం, విస్సన్నపేట తదితర ప్రాంతాల నుంచి విజయవాడకు వస్తుంటాయి. నిన్నమొన్నటి వరకు రైతు మార్కెట్లలో కిలో బెండకాయల ధర రూ.15 నుంచి రూ.17 ఉండగా, ఇప్పుడు రూ.26కు విక్రయిస్తున్నారు. దొండకాయల కిలో ధర రూ.8-రూ.9 ఉండగా, అదిప్పుడు రూ.17కి చేరింది. కిలో బీరకాయలు కొద్దిరోజుల క్రితం వరకు రూ.12 - 15లకు విక్రయించిన వ్యాపారులు, తాజాగా రూ.20కు దిగడం లేదు. కిలో పొట్లకాయలు మొన్నటి వరకు రూ.7 - 9లు పలకగ్గా, ఇప్పుడు రూ.15 వద్ద కూర్చుకున్నాయి. రైతుబజార్లలోనే ధరలు ఈవిధంగా ఉన్నాయి. బయటి మార్కెట్లో ఈ నాలుగు కూరగాయలను కిలో రూ.40ల వరకు విక్రయిస్తున్నారు.
పెళ్లి భోజనాలకే సరిపోవడం లేదు..
రైతు మార్కెట్లతో పోల్చితే బయట మార్కెట్లలో కూరగాయలకు ప్రస్తుతం ఎక్కువ ధరలు పలుకుతుండడంతో రైతులు పండించిన పంటలను అక్కడికే తరలించేస్తున్నారు. ఫలితంగా రైతుబజార్లు కొరతను ఎదుర్కొంటున్నాయి. జిల్లాల్లో ఈ వర్షాలకు బెండ, దొండ, బీర, పొట్లకాయల పంటలు నాశనమైపోయాయి. మూడు రోజులుగా పెళ్లి ముహూర్తాలు జోరుగా ఉన్నాయి. అందుబాటులో ఉన్న కొద్ది సరుకును బయటకు మార్కెట్లకు, పెళ్లిళ్లకు పంపేస్తున్నారు. చేతికి వచ్చిన పంటలను రైతులు ఈ పెళ్లి పందిళ్లలో అమ్మేస్తున్నారు. ఈ ప్రభావమూ రైతు మార్కెట్లపై పడుతోంది. ఇక చిక్కుళ్లు, గోరు చిక్కుళ్లు గుంటూరు జిల్లా నుంచి విజయవాడ మార్కెట్లకు వస్తుంటాయి. ఈ పంటలకూ వర్షం దెబ్బ గట్టిగా తగిలింది. దీంతో ఉన్న పంటంతా అక్కడే ఆగిపోయింది. బయటి మార్కెట్లలో వీటి ధర రూ.40 పలకడం గమనార్హం. మరో నెల రోజులపాటు కూరగాయల కొరత, ధరల మంటలు ఇలాగే ఉంటాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
