Published: 12-08-2018
ఆన్‌లైన్ కంటే.. ఆఫ్‌లైన్ హాట్ గురూ

రిజిస్ర్టేషన్ శాఖలో ఈ-డాక్యుమెంట్ అపహాస్యమౌతోంది! రిజిస్ర్టేషన్ శాఖను ప్రక్షాళన చేయటానికి, ప్రజలకు పారదర్శకమైన సేవలను అందించటానికి ప్రయోగాత్మకంగా తీసుకు వచ్చిన ఈ - డాక్యుమెంట్ విఫలమవుతోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ఈ - డాక్యుమెంట్ కూడా రాకపోవటం గమనార్హం. ఈ-డాక్యుమెంట్ వ్యవస్థను ఉద్దేశ్యపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
విజయవాడ: రవాణా శాఖలో ఈ ’సేవలను నూరుశాతం విజయవంతంగా అమలు చేస్తున్నారు. రెవెన్యూలో తీసుకు వచ్చిన కొన్ని ‘ఈ’ సంస్కరణలు విజయవంతమౌతు న్నాయి. అదేమి చిత్రమో రిజిస్ర్టేషన్ శాఖలో తీసుకు వచ్చే ఈ సంస్కరణ లు మాత్రం అమలు కావు. కనీసం ప్రజలకు అందుబాటులో కూడా ఉండవు. రిజిస్ర్టేషన్ శాఖలో విచ్చలవిడి అవినీతికి ఉన్న ఏకైక అవకాశం మాన్యువల్ దరఖాస్తుల వల్లనే జరుగుతుందనేది బహిరంగ రహస్యం. దస్తావేజు లేఖర్ల ద్వారా తయారైన మాన్యువల్ దరఖాస్తులను రిజిస్ర్టేషన్ శాఖ స్వీకరిస్తోంది. వీటిని ఆ తర్వాత ఆన్‌లైన్‌లోకి పొందుపరుస్తున్నారు. కానీ, దస్తావేజు లేఖరుల నుంచి రూపొందిన డాక్యుమెంట్లను స్వీకరించే ఆఫ్‌లైన్ విధానంలో విచ్చలవిడి అవినీతికి ఆస్కార మేర్పడుతోంది. డాక్యు మెంట్ రైటర్లు తమ దగ్గరకు వచ్చేవారికి సబ్ రిజిస్ర్టార్‌కు ఇంత పర్సంటేజీ ఇస్తే కానీ పని కాదని చెప్పి వారి దగ్గర నుంచి ఆ మొత్తం స్వీకరించి వారికి సమర్పించే సంప్రదాయం వేళ్ళూనుకు పోయింది. ఇప్పటికీ డాక్యుమెంట్ రైటర్లు చేసే పని ఇదేనన్న విమర్శలు ప్రజల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నాయి.
డాక్యుమెంట్ రైటర్ తాలూకా ఏజంట్ వ చ్చి దరఖాస్తును తీసుకు వస్తే తప్ప సబ్ రిజిస్ర్టార్ సంతకం పెట్టే పరిస్తితి ఉండదు. ఒకవేళ డాక్యుమెంట్ రైటర్ దగ్గర ఎవరైనా డాక్యుమెంట్ రాయించుకుని తీసుకుని నేరుగా సబ్ రిజిస్ర్టార్‌ను కలిస్తే వారికి చుక్కలు చూపిస్తారు. లోపాలు వెతికి పడతారు. అది తీసుకురా.. ఇది తీసుకురా అంటారు. ఆ మార్పులు చేయాలి.. ఈ మార్పులు చేయాలి అంటారు. కాళ్ళరిగేలా రిజిస్ర్టార్ కార్యాలయాల చుట్టూ తిరిగినా పనికాదు. అదే డాక్యుమెంట్ రైటర్ల తరపున ఏజంట్లు తీసుకు వచ్చే దరఖాస్తులపై సబ్‌రిజిస్ర్టార్ సంతకాలు వేగంగా పడిపోతాయి. డాక్యుమెంట్ రైటర్లే సబ్ రిజిస్ర్టార్లకు వ సూల్ రాజాలుగా మారిపోయారన్నది బహిరంగ రహస్యం. సబ్‌రిజిస్ర్టార్‌కో రేటు, ఆఫీసు సిబ్బందికో రేటును నిర్ణయించి మరీ దరఖాస్తుదారుల దగ్గర డాక్యుమెంట్ రైటర్లు వసూళ్ళకు తెగబడుతున్నారన్న విమర్శలు అనేకం ఉన్నాయి.
డాక్యుమెంట్ రైటర్ తీసుకు వచ్చిన ఫైల్‌పై సంతకం పడిన తర్వాత వాటిని ఆన్‌లైన్‌లోకి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈప్రక్రియ పూర్తి కావటానికి ఆఫీసు సిబ్బందికి మామూళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా అంచెకో రేటు కట్టి మరీ డబ్బులు వసూలు చేసే సంప్రదాయం రిజిస్ర్టేషన్ శాఖలో కొనసాగుతోంది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీ సేవలను అందించటానికి ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ర్టేషన్ శాఖలో కూడా ఒక మంచి విధానంతో ఈ - డాక్యుమెంట్‌ను తీసుకు వచ్చింది. ఈ - ప్రగతి ద్వారా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ప్రజలకు సులభతరమైన సేవలు అందుతున్నాయి. ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది.
ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధం ఉంటే డిపార్ట్‌మెంట్లలో రవాణా శాఖలో ఇటీవల నూరు శాతం ఆన్‌లైన్ సేవలను ప్రారంభించారు. మధ్య వర్తుల ప్రమేయం దాదాపుగా తగ్గింది. తొంబై శాతం అవినీతి తగ్గిపోయిందనే చెప్పాలి. రెవెన్యూలో తీసుకు వచ్చిన సంస్కరణలు సగం మేర ఫలించాయని చెప్పవచ్చు. ఈ రెండింటి తర్వాత ప్రజలతో ప్రత్యక్షంగా ప్రమేయం ఉండే శాఖలలో ఒకటి గా ఉండే రిజిస్ర్టేషన్ శాఖలో మాత్రం పూర్తి స్థాయిలో సంస్కరణలు జరగలేదనే చెప్పాలి. అతి కష్టంమీద తీసుకు వచ్చిన ఈ - డాక్యుమెంట్ వ్యవస్థకు బూజు పట్టించేశారు. సబ్ రిజిస్ర్టార్ పోస్టు అంటే కోట్లు ఆర్జించే స్థానాలుగా మారిపోయాయి. రియల్ భూమ్ ఉన్న చోట, ర్యాపిడ్ గ్రోత్ ఏరియాలు ఉన్నచోట, లావాదేవీలు ఎక్కువుగా జరిగేచోట పనిచేసే సబ్ రిజిస్ర్టార్లు కాసులు పిండు కుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. డాక్యుమెంట్ రైటర్ల ద్వారా సబ్‌రిజిస్ర్టార్లకు పైసలు ముట్టచెప్పే సంప్రదా యానికి పుల్‌స్టాప్ పెట్టే ఈ - డాక్యుమెంట్ వ్యవస్థను అందరూ కలిసి తుంగ లో తొక్కేస్తున్నారు.
