Published: 06-08-2018
జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ సత్తా

ఇంధన పొదుపులో ఆంధ్రప్రదేశ్ మరోసారి జాతీయ స్థాయిలో సత్తాచాటింది. కేంద్ర విద్యుత్ శాఖ తొలిసారిగా విడుదల చేసిన రాష్ట్ర ఇంధన పొదుపు సన్నద్ధత సూచీలో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. ఇంధన పొదుపు కార్యక్రమాల అమలు విషయంలో ప్రపంచ బ్యాంకు ఏపీని ఇప్పటికే నంబర్‌వనగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా జాతీయ ఇంధన పొదుపు సంస్థ (బీఈఈ), నీతి ఆయోగ్ సంయుక్తంగా రూపొందించిన సూచీలోనూ ఏపీ ఇతర రాష్ట్రాల కంటే ముందు వరుసలో నిలిచింది. బీఈఈ 63 ప్రామాణికాల ఆధారంగా ఈ సూచీని రూపొందించింది. భవనాలు, పరిశ్రమలు, మున్సిపాలిటీలు, రవాణా, వ్యవసాయం, డిస్కంలలో ఇంధన సామర్థ్య ఫలితాలను అంచనా వేసి దీన్ని రూపొందించారు.
దేశవ్యాప్తంగా ఏపీకి అగ్రస్థానం దక్కగా... కేరళ, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో నిలిచాయి. . భవనాలు, ఇళ్లు, డిస్కంలు, పరిశ్రమల్లో పీఏటీ (పెర్ఫామ్, అచీవ్, ట్రేడ్) పథకం ద్వారా ఏపీ ఇంధన పొదుపు కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఇతర రాష్ర్టాలు బీఈఈ సూచించిన ఒకటి రెండు పథకాలకే పరిమితం కాగా.. ఏపీతోపాటు టాప్‌లో ఉన్న ఐదు రాష్ర్టాలు మాత్రం వాటి సొంత పథకాలను కూడా అమలు చేస్తున్నాయని బీఈఈ కొనియాడింది. కాగా... ఏపీ అమరావతి మాస్టర్‌ప్లాన్, డిజైన్‌కుగాను గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ప్లాటినం అవార్డు దక్కించుకున్న విషయాన్ని కూడా బీఈఈ తన సూచీ నివేదికలో ప్రశంసించిందని సీఆర్‌డీఏ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ సీఎం చంద్రబాబుకు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఇంధనశాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.
