Published: 01-08-2018
ఒత్తిళ్లు..వేధింపులు..ముగ్గురు టీటీడీ ఉద్యోగుల ఆత్మహత్య

ఆధ్యాత్మిక సంస్థ టీటీడీలో ఉద్యోగులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. పనిభారంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. విధుల్లో ఒత్తిడిని కుటుంబ సభ్యులపై చూపుతుండటంతో ఇళ్లలో గొడవ లు పెరిగిపోయాయి. ఈ నెలలోనే ముగ్గురు టీటీడీ ఉద్యోగులు ఉరి వేసుకుని ఆత్మహత్యలకు పాల్పడడం గమనార్హం. ఇటువంటి తొందరపాటు చర్యలతో కుటుంబ సభ్యులు వీధినపడుతున్నారు. చిన్నచిన్న పిల్లలు ఉన్న ఉద్యోగులు ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. శ్రీవారి దర్శనార్థం ఓ పదేళ్ల క్రితం రోజుకు ముప్పై వేల మంది భక్తులు వచ్చేవారు. అప్పట్లో 14 వేల మంది ఉద్యోగులు పనిచేసేవారు. ఇటీవల కాలంలో భక్తుల తాకిడి రోజుకు 80 వేలకు, వారాంతాల్లో లక్షకు పైగా చేరుకుంది. కొత్త నియామకాలు లేక ఉద్యోగుల సంఖ్య 8 వేలకు పడిపోయింది. ఉన్నవారిపై పనిబారం ఎక్కువైంది. నలుగురు చేయాల్సిన పనిభా రం ఒక్క ఉద్యోగిపై పడుతుండటంతో మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారు.
బాసుల వేధింపులూ తక్కువేంకాదు
టీటీడీలో సిబ్బంది పట్ల అధికారులు చులకన భావనతో వ్యవహరిస్తుండటం, వేధింపులకు గురిచేస్తున్న ఘటనలూ ఉద్యోగుల ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. రెండు రోజుల క్రితం టీటీడీ డీఈవో కార్యాలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ మునిశంకర్ ఆత్మహత్యకు ఉన్నతాధికారుల వేఽధింపులే కారణం. మునిశంకర్ సూసైడ్ నోట్ రాసి వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరడం గమనార్హం. అంతకుముందు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో పనిచేసే అటెండర్ అనిల్‌కుమార్ యాదవ్ కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం తిరుపతి కొర్లగుంటలో నివాసం ఉంటున్న తిరుమల కల్యాణకట్ట ఉ ద్యోగి విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఆత్మహత్యాయత్నాలూ బోలెడున్నాయి. శ్రీవారి పోటులో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ రవి తనను సర్వీసెస్ డిప్యూటీ ఈవో వేధింపులకు గురిచేస్తున్నాడని ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్ ఎదుట వాపోయారు. తిరుమల పోటులో పనిచేస్తున్నానని, తనను ఆయుర్వేద ఆసుపత్రికి మార్చాలని విన్నవించుకున్నారు. శ్వేతలో పనిచేసే మరో ఉద్యోగి కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు టీటీడీ గ్రూప్‌లో మెసేజ్ చేయడంతో హుటాహుటిన ఉద్యోగ సంఘ నాయకులు చేరుకుని అతడిని సముదాయించారు.
రిక్రూట్‌మెంట్ లేకే పని ఒత్తిడి
పని ఒత్తిడి నేపథ్యంలో మానసికంగా కృంగిపోయి టీటీడీ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని యునైటెడ్ ఫ్రంట్ నాయకుడు, టీటీడీ ఎంప్లాయీస్ జేఏసీ నాయకుడు గోల్కొండ వెంకటేశం ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు కూడా ఉద్యోగుల పట్ల సానుకూలంగా వ్యవహరించాలన్నారు. రిక్రూట్‌మెంట్ లేకపోవడంతోనే ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోందన్నారు. ఉద్యోగుల ఏదైనా సమస్యలను మిత్రులకు, సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు, ఉద్యోగ సంఘాల నాయకుల దృష్టికి తీసుకొచ్చే విధంగా కౌన్సిలింగ్ నిర్వహించి అవగాహన కల్పించాల్సిన బాధ్యత టీటీడీ యాజమాన్యంపై ఉందన్నారు.
