Published: 29-07-2018
మోదీ దత్తపుత్రుడు పవన్

అవినీతిపుత్రుడు జగన్మోహన్‌రెడ్డి, మోదీ దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో లాలూచీపడ్డారని మంత్రి లోకేశ్ విమర్శించారు. శనివారం ఒంగోలులో జరిగిన ధర్మపోరాట దీక్ష సభలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు జగన్, జనసేన నాయకుడు పవన్ కల్యాణ్‌లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన ప్రసంగంలో జగన్‌ను ‘దొంగబ్బాయి’ అని పలుమార్లు సంబోధించారు. ‘నేను పుట్టినప్పుడే మా తాత ముఖ్యమంత్రి. నేను చెడ్డీలు వేసుకునే రోజుల్లో మా నాన్న ముఖ్యమంత్రి. అయినా నాపైన ఇప్పటివరకు ఎలాంటి ఆరోపణలూ లేవు. కానీ ఇటీవల లేనిపోని విమర్శలు చేస్తున్నారు. వాటిని సాక్ష్యాధారాలతో నిరూపించండి చూద్దాం’ అని సవాల్ విసిరారు. ‘బీజేపీలో బీ అంటే భారతీయ, జే అంటే జగన్, పీ అంటే పవన్’ అని అభివర్ణించారు. రాష్ట్రానికి హోదా ఇవ్వకుండా తీరని అన్యాయం చేస్తున్న మోదీని ఈ ఇద్దరూ విమర్శించడం లేదన్నారు.
కేసుల నుంచి బయట పడేందుకు జగన్ రాష్ట్ర ప్రయోజనాలను మోదీ వద్ద పణంగా పెట్టారని విమర్శించారు. తెలుగు వారికి అన్యాయం చేస్తున్న మోదీని వదిలి పెట్టబోమని, కర్ణాటకలో ట్రయిలర్ మాత్రమే చూపించామని, 2019 ఎన్నికల్లో పూర్తి సినిమా చూపిస్తామన్నారు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే తాను ఢిల్లీ వచ్చి ఇతర పార్టీల ఎంపీలతో మాట్లాడి మద్దతు కోరతానని చెప్పిన పవన్ అవిశ్వాసం సమయంలో అడ్రస్ లేకుండా పోయారని విమర్శించారు. నాడు ఇందిరాగాంధీకి తెలుగువారి సత్తా ఏమిటో చూపించిన దివంగత ఎన్టీ రామారావు తరహాలోనే మోదీకి కూడా చంద్రబాబు తగిన విధంగా సమాధానం చెబుతారని ఆయన అన్నారు. ఇందుకోసం ఆయనకు అండగా నిలిచి, రాష్ట్రంలోని 25 ఎంపీ సీట్లలో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని లోకేశ్ పిలుపిచ్చారు.
