Published: 25-07-2018
బీజేపీ మొదటి ముద్దాయి టీడీపీ రెండో ముద్దాయి..

నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా దక్కకపోవడంలో ప్రథమ ముద్దాయి బీజేపీయేనని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. ఇందులో టీడీపీ రెండో ముద్దాయి కాగా... కాంగ్రెస్ మూడో ముద్దాయి అని తెలిపారు. ఏపీ సమస్యలపై మంగళవారం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన ప్రసంగించారు. వైసీపీ నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తోందన్నారు. ‘‘2014లో బీజేపీ ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి మండలిలో హోదాకు ఆమోదం తెలిపారు. ఆ ఏడాది డిసెంబరు 31 వరకు ప్రణాళికా సంఘం కొనసాగింది. జనవరి 1 నుంచి నీతీ ఆయోగ్ వచ్చింది. మరి... మే 26 నుంచి ఏడు నెలల కాలం ఉన్నప్పటికీ ఏపీకి హోదా ఎందుకు ఇవ్వలేదు?’’ అని విజయ సాయి నిలదీశారు.
