Published: 24-07-2018
రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు, కార్యకర్తల ఆందోళన.. అరెస్ట్ !!!

అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం.. రాష్ట్ర విభజన చట్టం అమలుపై లోక్‌సభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నేడు వైసీపీ తలపెట్టిన బంద్‌లో భాగంగా రాష్ట్రంలోని వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. బంద్‌లో భాగంగా షాపులు, స్కూల్స్, కాలేజీలు, వాహనాలు నడువకుండా అడ్డుకుంటున్నారు.
- తిరుపతిలో వైసీపీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- కర్నూలులోనూ వైసీపీ నేతలు, కార్యకర్తలు బంద్ పాటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద బస్సులను అడ్డుకున్నారు. దీంతో తెలంగాణ, బెంగళూరుకు బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. వైసీపీ నేతలు బివై రామయ్య, హఫీజ్ ఖాన్, తెర్నకల్ సురేంద్రను పోలీసులు అరెస్టు చేశారు.
- శ్రీకాకుళం జిల్లాలోనూ వైసీపీ నేతలు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట జరిగిన ధర్నాలో ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. శ్రీకాకుళం, పలాస డిపోల్లో బస్సులు పూర్తిగా డిపోలకే పరిమితమయ్యాయి.
- ప్రకాశం జిల్లాలో కూడా వైసీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా బంద్ కార్యక్రమం చేపట్టారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట వైసీపీ కార్యకర్తలు బైఠాయించారు.
వైసీపీ బంద్ నేపథ్యంలో ఒంగోలులో వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
- అనంతపురం జిల్లాలో కూడా వైసీపీ కార్యకర్తలు బంద్ బంద్ కార్యక్రమం చేపట్టారు. దీంతో పోలీసులు మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఇంటి ఎదుట మోహరించారు. అదేవిధంగా రోడ్లపై బారీకేడ్లు ఏర్పాటు చేశారు.
- తూర్పు గోదావరి జిల్లాలో కూడా వైసీపీ నేతలు బంద్ కార్యక్రమం చేపట్టారు. కాకినాడ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర బస్సులను అడ్డుకున్నారు. ప్రత్యేక హోదా కోసం అమలాపురంలో వైసీపీ ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. దీంతో బస్సులు బస్టాండ్‌లోనే నిలిచిపోయాయి.
- కడప జిల్లాలో కూడా వైసీపీ నేతలు బంద్‌లో భాగంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. మేయర్ సురేశ్‌బాబుతోపాటు పలువురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
- పులివెందులలో కూడా చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ వివేకానందరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
- విజయవాడ వ్యాప్తంగా వైసీపీ నేతలు బంద్ నిర్వహిస్తున్నారు. పండిట్‌నెహ్రూ బస్‌స్టేషన్ ఎదుట వైసీపీ నేతల ఆందోళనకు దిగారు. దీంతో పార్థసారథి, యలమంచిలి రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- ప.గో జిల్లాలో వైసీపీ బంద్ పాటిస్తోంది. ఎనిమిది డిపోల్లో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కొవ్వూరు, జంగారెడ్డిగూడెంలో వైసీపీ నాయకుల ఆందోళనకు దిగారు. ఏలూరులో జూట్‌మిల్లు మూసివేశారు.
- విశాఖలో వైసీపీ ఇచ్చిన బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. మద్దిలపాలెం జంక్షన్‌లో వైసీపీ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు.
- విజయనగరం జిల్లాలో బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. రోడ్లపై బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర బైఠాయించి ఆందోళనకు దిగిన వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
