Published: 14-07-2018
ఏపీ చేపలపై పలు రాష్ట్రాల్లో ఆంక్షలు

నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ.. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ చేపలంటే ఎగబడే ఈ రాష్ట్రాలు ఇప్పుడు ఏపీ నుంచి వచ్చిన చేపలంటేనే బెంబేలెత్తుతున్నాయి. దీనికి కారణం ఏపీ నుంచి దిగుమతి అయ్యే చేపలను ఫార్మాలిన్ ద్రావణంతో నిల్వ చేస్తున్నారన్న వార్తలు రావడమే. అంతుకు ముందు కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లోనూ ఏపీ చేపల్లో ఫార్మాలిన్ ఆనవాళ్లను అక్కడి అధికారులు గుర్తించి పెద్ద ఎత్తున చేపలను సీజ్ చేశారు. ఈ ఏడాది జూన్‌లో కేరళ రాష్ట్ర ఆహార భద్రత విభాగం అధికారులు ఏపీ నుంచి దిగుమతి అయిన 20 వేల కేజీల చేపలను ఫార్మాలిన్ ఆనవాళ్లు ఉన్నాయంటూ సీజ్ చేశారు. మరోవైపు మన రాష్ట్రానికి చెందిన రైతులు తాము ఫార్మాలిన్‌ను వినియోగించడం లేదని, ఆయా రాష్ట్రాల్లోని స్థానిక వ్యాపారులే దాన్ని వినియోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాజా పరిణామాల కారణంగా దేశంలోనే చేపల ఎగుమతిలో నంబర్‌వన్ స్థానంలో ఉన్న ఏపీ చేప దిక్కుతోచక బిక్కుబిక్కు మంటోంది. ఎగుమతులు తగ్గిపోయి తమ ఉపాధికి ఎక్కడ దెబ్బపడుతుందోనని అటు చేపల చెరువుల రైతులు, మత్స్యకారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఫార్మాలిన్ వాడకంలో వాస్తవం?
చేపలను ఎక్కువ కాలం నిల్వ చేసేందుకు ఫార్మాలిన్ ద్రావణాన్ని చేపలపై పూతగా పూస్తుంటారు. రైతులెవరూ ఈ విధానాన్ని అవలంబించరు. చేపలను కొనుగోలు చేసిన వ్యాపారుల ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి ప్రతిరోజూ 300 నుంచి 400 లారీల చేపల లోడ్లు పశ్చిమ బెంగాల్, పంజాబ్, మేఘాలయ, అసోం, నాగాలాండ్ వంటి రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. ఒక్కో లారీలో 10 నుంచి 12 టన్నుల చేపలు ఎగుమతి చేస్తుంటారు.
- చేపల వేటపై నిషేధం ఉన్న సమయంలో లభ్యత తక్కువగా ఉంటుంది కాబట్టి ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేసేందుకు, అందుకు అవసరమైన అధిక మొత్తంలో చేపలు లభ్యమయ్యేదాకా వానిటి పాడవకుండా నిల్వ చేసేందుకు వ్యాపారులు ఫార్మాలిన్ వాడతారు.
- సాధారణంగా వ్యాపారులు ప్లాస్టిక్ ట్రేలు, ధర్మాకోల్ బాక్సుల్లో చేపలను నింపి ఎగుమతి చేస్తుంటారు. ప్లాసిక్ ట్రేలో వేసిన ఐస్ వెంటనే కరిగిపోతుంది. దీంతో ఐస్ కరగకుండా ఉండేందుకు అమ్మోనియాను వినియోగిస్తారు. ఇది కూడా హానికర పదార్థామే.
