Published: 13-07-2018
ఆర్టీసీకి .. రోజుకు రూ.8.32 లక్షల భారం

పెరుగుతున్న డీజిల్ ధరలు ఆర్టీసీకి మరింత భారమవుతున్నాయి. ఏడాదికి ఆర్టీసీ రూ. 30.36 కోట్ల మేరకు డీజిల్ భారాన్ని మోయాల్సి వస్తోంది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు అన్న చందంగా ఆర్టీసీ పరిస్థితి తయారైంది. ప్రైవేటు వాహనాల ధాటికి ఆర్టీసీ పీకల్లోతు నష్టాల్లోకి కూరుకుపోతోంది. ఆ నష్టాల నుంచి గట్టెక్కేందుకు రకరకాల మార్గాలను అన్వేషించింది. ప్రైవేటుకు దీటుగా కొత్త బస్సులను కొనుగోలు చేసి తిప్పుతోంది. అయినా లాభాలబాటలో పట్టలేదు. ఇతర మార్గాల ద్వారా ఆదాయం పెంచేందుకు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుంటుంది.
ఖాళీ స్థలాల లీజు, మల్టీప్లెక్స్‌ల నిర్మాణాన్ని చేపట్టింది. అలాగే సొంతంగానే పార్శిల్ సర్వీసు రంగంలోకి అడుగు పెట్టింది. చిల్లర సమస్యతో టికెట్ల రేటును సవరించింది. అయినప్పటికీ ఇంకా లాభాల రూటు ఎక్కడంలేదు. ఈ సమయంలోనే బులియన్ ధరల మాదిరిగా డీజలు ధరలు అదనపు భారంగా మారింది. ఏడాది కాలంలో లీటరు డీజలుపై రూ.13.06 పైసలు పెరిగింది. ఇప్పుడున్న ధరలు ఇలాగే కొనసాగితే రోజుకు రూ.8.32 లక్షల చొప్పున ఏడాదికి రూ.30.36 కోట్ల అదనపు భారం సంస్థ మోయాల్సి ఉంది. ఇక ఇప్పటికే జిల్లాలో కడప డిపో మినహాయిస్తే అన్ని డిపోలు నష్టాల్లో కూరుకుపోయాయి. లాభాల్లో ఉన్న కడప డిపో కూడా ఈ సారి నష్టాల్లోకి చేరుకుంది. ఏప్రిల్, మే, జూన్ మాసాలకు గాను కడప డివిజన్ రూ.10.75 కోట్లు నష్టాల్లోకి కూరుకుపోయి ఉంది. జిల్లాలో 867 బస్సులున్నాయి. వీటిలో 294 అద్దె బస్సులున్నాయి. ప్రతిరోజూ అన్ని బస్సులు 3.20 లక్షల కిలోమీటర్ల మేర తిరుగుతున్నాయి.
