దళితులపై దాడులు పెరిగిపోతున్నాయి

దేశంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా గుజరాత్‌లో ఇటువంటి ఘటన చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం అగ్రవర్ణాలకు చెందిన నలుగురు యువకులు ఒక యువకునిపై దాడి చేశారు. దళిత యువకునికి హెయిర్ కట్ చేశాడనే నెపంతోనే వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఘటన మెహసాణాలోని సత్లాసనా తాలూకాలోగల అమ్రెచా గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుని తండ్రి జసీబెన్ భగవాన్‌దాస్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడు గ్రామంలో సెలూన్ దుకాణం నడుపుతున్నాడని, ఇటీవల నలుగురు యువకులు అతనిపై దాడి చేశారని ఆరోపించారు. 10 రోజుల క్రితం దళితులకు హెయిర్ కటింగ్ చేయవద్దని తన కుమారుడిని వారు హెచ్చరించారని తెలిపారు. అయితే తన కుమారుడు వారి మాటను పట్టించుకోలేదు. దీంతో వారు తన కుమారునిపై అమానుషంగా దాడి చేశారని పేర్కొన్నారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకునే పనిలోపడ్డారు.
