భాల్య వివాహానికి అడ్డుకట్ట ....

అభం శుభం తెలియని 16ఏళ్ల చిన్నారి పెళ్లికూతురయింది. ముగ్గురు పిల్లలకు తండ్రి అయిన ఓ 40ఏళ్ల వ్యక్తికి ఆమెను భార్యగా మార్చేందుకు రంగం సిద్ధమైంది. ఐసీడీఎస్, షీటీమ్ సిబ్బంది సమయానికి వచ్చి అడ్డుకోవడంతో ఆ పెళ్లి కాస్తా రద్దయింది. కర్నూలు జిల్లా డోన్‌లో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని రాజా థియేటర్ వెనుక పూసలు అమ్మి జీవనం సాగించే దంపతులు నివసిస్తున్నారు. వారి రెండో కుమార్తె ఈ ఏడాది టెన్త్ పాసయింది. ఆర్థిక ఇబ్బందులతో ఆమె చదువును మాన్పించిన తల్లిదండ్రులు, ఆమెను కడప జిల్లా మైదుకూరుకు చెందిన వెంకటరమణకు ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించారు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. శనివారం బండిఆత్మకూరు సమీపంలోని ఓంకార క్షేత్రంలో పెళ్లి జరగాల్సి ఉంది. సమాచారం తెలుసుకున్న కర్నూలు ఐసీడీఎస్ సిబ్బంది, డోన్ షీటీమ్ సభ్యులు పెళ్లివారింటికి వెళ్లారు. మైనర్ బాలికకు వివాహం చేయకూడదని సర్దిచెప్పడంతో వివాహం ఆగిపోయింది.
