వాషింగ్టన్ డీసీలో.. తానా మహాసభలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 22వ ద్వైవార్షిక మహాసభలను వాషింగ్టన్ డీసీలో నిర్వహించనున్నట్టు తానా అధ్యక్షుడు సతీష్ వేమన తెలుగు మీడియాకు వెల్లడించారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించే మహాసభలను 12 ఏళ్ల తర్వాత మళ్లీ వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మహాసభల నిర్వహణలో పాలుపంచుకునేందుకు వాషింగ్టన్ డీసీలోని తెలుగు ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారని సతీష్ పేర్కొన్నారు. తానా ప్రతిష్ట పెంచేలా, తెలుగు భాషా సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఈ మహాసభలను నిర్వహించనున్నట్టు తెలిపారు. మీడియా సమావేశంలో తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం, తానా బోర్డు చైర్మన్ చలపతి కొండ్రకుంట, తానా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ప్రసాద్ నల్లూరి, మాజీ బోర్డు చైర్మన్ డాక్టర్ నరేన్ కొడాలి, 2007 తానా మహాసభల కన్వీనర్ డాక్టర్ హేమప్రసాద్ యడ్ల, తానా కోశాధికారి రవి పొట్లూరి తదితరులు పాల్గొన్నారు.
