ఇది కాపు సామాజిక వర్గానికి అదనపు బొనాంజ

గురజాల నియోజకవర్గంలో అధికార పార్టీకి ఎన్నికల్లో ‘కాపు’కాసే వారికి మరో శుభవార్త. కాపు సామాజిక వర్గానికి భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో శాసనసభ్యుడి తరువాత ప్రాధాన్యం కల్గిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దక్కించుకున్న కాపు వర్గానికి ఇది అదనపు బొనాంజ అని చెప్పవచ్చు. దాచేపల్లి మండల కేంద్రంలో కాపు భవన నిర్మాణానికి రూ.50లక్షలు మంజూరు కాగా, అదే మం డలంలోని గామాలపాడులో కాపు భవనం కోసం రూ.25లక్షలు కేటాయించారు. ప్రస్తుతం పిడు గురాళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా మునగా నిమ్మయ్య కూడా అదే సామాజిక వర్గం, అదే మండలానికి చెందినవారు.
అక్కడే ఎందుకంటే...
వాస్తవానికి నియోజకవర్గంలో కాపు ఓటర్లు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నారు. అందులోను దాచేపల్లి మండలంలోనే ఎక్కువ. గత ఎన్నికల్లో ఈ మండలంలోని కాపులు తెలుగు దేశం పార్టీకి పూర్తి అనుకూలంగా ఉన్నారు. దాంతోపాటు ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తిది కూడా ఇదే మండలం. ఈ మండలంలోని కాపులతో వైరం ఉండటం కూడా ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది. గామాలపాడులో జంగాకు, కాపు వర్గానికి మధ్య ఢీ అంటే ఢీ అనే స్థాయిలో వైరుధ్యాలున్నాయి.
ఈ నేపధ్యంలోనే దాచేపల్లి కాపులు కొన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నాయకత్వాన్ని బలపరుస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యే యరపతినేని కూడా పదవులు, నిధుల కేటాయింపులో ఈ మండలంలోని కాపు నాయకులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని మునగా నిమ్మయ్యకు ఇవ్వడంతోపాటు, పదవీ కాలాన్ని కూడా పొడిగించడం జరిగింది. కాపు భవనాల ఏర్పాటు అంశం తెరమీదకు వచ్చిన తరువాత సీఎం వద్దకు ఎమ్మెల్యే ప్రత్యేకంగా వెళ్లి మరీ దాచేపల్లి కోసం నిధులు కేటాయించాలని కోరారు. మొదటి విడత దాచేపల్లి, గామాలపాడు గ్రామాలలో కాపు భవనాలు నిర్మిస్తారు.
