విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు తెలిపారు. గురువారం విశాఖ రైల్వే స్టేషన్‌లోని జ్ఞానాపురం ప్రవేశద్వారం వద్ద తూర్పు కోస్తా రైల్వే వాల్తేరు డివిజన్ ఏర్పాటుచేసిన మెకనైజ్డ్ లాండ్రీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన సమావేశంలో రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిందని వెల్లడించారు. అయితే తూర్పుకోస్తా రైల్వేలోని వాల్తేరు డివిజన్‌ను విభజించే ప్రక్రియ, కొత్తజోన్ ఏర్పాటుకు విధివిధానాలు ఖరారు కావలసి ఉందన్నారు. రాజకీయపరంగా మరికొన్ని చర్చలు జరిగాక ప్రజాప్రతినిధుల అభిప్రాయాల మేరకు కొత్త జోన్ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన విడుదలవుతుందని తెలిపారు. సాంకేతిక అడ్డంకులు, ఇతర పరిస్థితుల కారణంగా జాప్యం జరుగుతోంది తప్ప.. జోన్ ఏర్పాటుకు కేంద్రం వ్యతిరేకంగా లేదన్నారు. త్వరలోనే తీపి కబురు అందించేందుకు రంగం సిద్ధం చేస్తోందని స్పష్టం చేశారు.
