పర్వతారోహణకు వెళ్లి.... తెలుగు యువకుని మృతి

అమెరికాలోని కాలిఫోర్నియాలో పర్వతారోహణకు వెళ్లిన ప్రవాసాంధ్రుడు పెనుగొండ ఆశిష్(29) ప్రమాదవశాత్తు మృతి చెందారు. యెసెమైట్ జాతీయ పార్కులో ప్రఖ్యాత హాఫ్ డ్రోమ్ పర్వతారోహణలో ఈ అపశ్రుతి చోటు చేసుకుంది. హాఫ్ డోమ్ అనేది గ్రానైట్ పర్వతం. దీనిపై 45 డిగ్రీల వాలు ఉండే ప్రాంతంలో సుమారు 182 మీటర్ల దూరం వరకు కేబుల్స్ అమర్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన ఆశిష్ గత మంగళవారం మిత్రులతో కలిసి ఈ కొండను ఉత్తరం వైపు నుంచి అధిరోహిస్తున్న సమయంలో ఉరుములతో కూడిన గాలివాన సంభవించింది. దీంతో ఆయన కేబుల్ పట్టుతప్పి జారి కింద పడి మృతి చెందారు. ఆశిష్ జారిపడిపోవడం గమనించిన పార్కు సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని ప్రమాదంలో ఉన్న మరో యువకుడిని కాపాడారు. ఫెయిర్లే డికిన్సన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆశిష్ న్యూజెర్సీలోని సీమెన్స్ హెల్త్‌కేర్ సంస్థలో బయోకెమిస్ట్‌గా పనిచేస్తున్నారు.
