రెండోరోజూ పోటెత్తిన అభిమానం

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి రాష్ట్రవ్యాప్తంగా నలుదిక్కుల నుంచి అభిమానులు మహానాడుకు తరలివచ్చారు. ఎన్టీఆర్ పురిటిగడ్డ కృష్ణా జిల్లా, పొరుగున గుంటూరు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు కదలి వచ్చారు. మహానాడు అంటే ఎన్టీఆర్‌కు ఎంతో ఇష్టం. కార్యకర్తలు, నేతలకు మహానాడు పండుగ వంటిది. మహానాడుకు అత్యంత విలువనిచ్చే ఎన్టీఆర్ ఆత్మ మహానాడులో సంచరిస్తుందని, ఆయన పుట్టిన రోజునాడు వస్తే ఆయన చెంతకే వచ్చామని సంతృప్తి చెందే అభిమానులు ఎందరో ఉన్నారు. మహానాడు రెండోరోజున భారీగా అభిమానులు తరలివచ్చారు. చాలామంది రిజిస్ర్టేషన్ చేయించుకోకుండానే కౌంటర్ల వెనుక నుంచి లాబీలోకి వచ్చారు. ఎన్టీఆర్, చంద్రబాబు మినీ కటౌట్ల వద్ద సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా సభలో బాలకృష్ణ, లోకేష్ ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక ప్రదర్శనలు కనువిందు చేశాయి.
