పాకిస్థాన్ పై చైనా షాకింగ్ కామెంట్స్..

అంతర్జాతీయంగా టెర‌్రరిస్థాన్‌గా ముద్రపడిన పాకిస్థాన్‌కు చైనా మద్దతుగా నిలిచింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన పదజాలంతో ట్వీట్ చేసినప్పటి నుంచి పాకిస్థాన్ తీవ్రంగా మథనపడుతోంది. ఉగ్రవాదంపై తాము పోరాడుతున్నందుకే తమకు అమెరికా నిధులు ఇస్తోందని, ఆ నిధులు తాము చేసిన ఖర్చులను భర్తీ చేయడమేనని పేర్కొంది. ట్రంప్ ట్వీట్ అనంతరం అమెరికా ప్రభుత్వం పాకిస్థాన్‌కు ఇవ్వవలసిన దాదాపు రూ.1,600 కోట్ల సాయాన్ని నిలిపేసింది. దీంతో పాకిస్థాన్ ప్రధాని అబ్బాసీ చర్చోపచర్చలు జరుపుతున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ ఆధ్వర్యంలోని సంస్థ నిధులను సేకరించరాదని పాక్ ప్రభుత్వం ఆదేశించింది.
ఇదిలావుండగా, చైనా దిగ్భ్రాంతికరంగా ప్రవర్తిస్తోంది. తన మిత్ర దేశానికి మరోసారి అండగా నిలిచింది. పాకిస్థాన్ ఉగ్రవాదంపై పోరాడుతోందని కితాబునిచ్చింది. ఈ పోరాటంలో పాకిస్థాన్ చాలా త్యాగాలు చేసిందని ప్రశంసించింది. ఉగ్రవాదాన్ని నిరోధించాలన్న అంతర్జాతీయ లక్ష్యానికి అనుగుణంగా పాకిస్థాన్ అసాధారణ కృషి చేస్తోందని పేర్కొంది. చైనా విదేశాంగ శాఖ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఈ ప్రశంసల జల్లు కురిపించింది.
డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఇచ్చిన ట్వీట్‌లో పాకిస్థాన్‌ను తీవ్రంగా దుయ్యబట్టారు. పాకిస్థాన్‌కు అమెరికా నేతలు మూర్ఖంగా సాయం చేస్తున్నారని ఆరోపించారు. భారీ సాయాన్ని అందుకుంటున్న పాకిస్థాన్ తిరిగి అమెరికాకు ఇచ్చిందేమీ లేదని, కేవలం అబద్ధాలు, మోసాలు మాత్రమేనని పేర్కొన్నారు. ఉగ్రవాదులకు సురక్షిత ఆశ్రయాన్ని పాకిస్థాన్ కల్పిస్తోందని దుయ్యబట్టారు.
