Published: 22-08-2019
హైదరాబాద్‌లో విద్యుత్ భవనాలు తెలంగాణకే.

ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో విద్యుత్ శాఖకు చెందిన భవనాలు పూర్తిగా తెలంగాణ పరం కానున్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్ వాటా కింద డబ్బు చెల్లించాలని తెలంగాణ అధికారులు నిర్ణయించారు. ఈ భవనాల కింద ఏపీకి రావాల్సిన మొత్తం రూ.933 కోట్లుగా ఖరారు చేశారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన రెండు రాష్ట్రాల విద్యుత్ ఉన్నతాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకొన్నారు. ఈ నెలాఖరులో ముఖ్యమంత్రులు చర్చించుకుని ఈ నిర్ణయాలకు తుది ఆమోదముద్ర వేయనున్నారు. హైదరాబాద్‌లో రెండురాష్ట్రాల ఉమ్మడి ఆస్తులుగా మొత్తం ఐదింటిని గుర్తించారు. ఖైరతాబాద్‌లోని విద్యుత్ సౌధ భవనం ఇందులో అత్యంత విలువైంది. మొత్తం 5.80 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఇందులో కార్యాలయ భవనాలు, రిక్రియేషన్ క్లబ్, కొంత ఖాళీ స్థలం, విశ్రాంతి గృహాలు వంటివి ఉన్నాయి. ఇదికాక వెంగళరావునగర్‌లో కార్పొరేట్ ట్రైనింగ్ సెంటర్ పేరుతో 4.80 ఎకరాల స్థలం ఉంది. అందులో శిక్షణ కేంద్రంతోపాటు సిబ్బంది వసతి గృహం కూడా ఉంది.
నగరం నడిబొడ్డులో ఉండటంతో ఈ స్థలాలు, భవనాల విలువ వందల కోట్లలోనే ఉంది. ఇవిగాక వెంగళరావునగర్‌లోనే ట్రాన్స్‌కో, జెన్‌కో కార్పొరేట్ కార్యాలయాలు ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంట్రల్ డిస్కంలో ఏపీకి 26శాతం వాటా ఉంది. మింట్ కాంపౌండ్‌లోని దాని ప్రధాన కార్యాలయం, వెంగళరావు నగర్‌లోని మరో కార్యాలయ భవనంలో ఈ వాటా ఏపీకి వస్తుంది. తమ భాగం భవనాలు తమకు ఇచ్చేయాలని, లేదా వాటి విలువ చెల్లించాలని ఏపీ ప్రభుత్వం విభజన సమయం నుంచి కోరుతూ వస్తోంది. చివరకు ఆ భవనాలను తాము ఉంచుకొని వాటి విలువను నగదు రూపంలో చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. అంతేకాదు... విద్యుత్ సరఫరా బకాయిల కింద తెలంగాణ ఇవ్వాల్సిన మొత్తాన్ని అనేక వాదనల తర్వాత రూ.3వేల కోట్లుగా తేల్చారు. ఉభయ రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశంలో దీనిని కూడా ఆమోదించినట్లు సమాచారం. ఇంత మొత్తం నగదు రూపంలో చెల్లించడం కష్టమేనని, దీనికి బదులుగా ఈ మొత్తానికి సరిపడా విద్యుత్‌ను సరఫరా చేస్తామని తెలంగాణ ప్రతిపాదించింది. దీనిపై కూడా సీఎంల సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
