Published: 21-08-2019

ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించే యోచనలో వైసీపీ

ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించే యోచనలో వైసీపీ ప్రభుత్వం ఉందని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. బడ్జెట్‌లో రాజధానికి జగన్ సర్కార్ కేటాయింపులు, తాజాగా అమరావతిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు రాజధానిని మార్చాలని జగన్ ప్రభుత్వం భావిస్తోందని స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ ప్రభుత్వం రాజధానిని దొనకొండకు మార్చడం ఖాయమని చింతామోహన్‌ వ్యాఖ్యానించారు.
 
కేంద్రంతో ఇప్పటికే జగన్ చర్చలు కూడా జరిపారని ఆయన చెప్పారు. రాజధాని విషయంలో సీఎం జగన్‌ తొందరపడటం సరికాదని, రాజధానికి దొనకొండ ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు. అన్ని వనరులున్న తిరుపతిని రాజధానిగా చేయాలని చింతా మోహన్‌ ఓ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. జగన్ సర్కార్ రాజధానిపై అనుసరిస్తున్న వైఖరితో భూములిచ్చిన రైతుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.