Published: 16-08-2019

గర్వపడే స్వాతంత్య్ర పోరాటం మనది..

 ‘దేవుడు భలే స్ర్కిప్ట్‌ రాశాడు. అమరావతిని గ్రాఫిక్స్‌, భ్రమరావతి అని ఎవరైతే అబద్దాలు చెప్పారో.. వాళ్లతోనే ఇప్పుడు అక్కడ లైటింగ్‌ పెట్టించి దాన్ని మరింత అందంగా చూపించేలా చేశాడు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. సచివాలయాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విద్యుద్దీపాలతో అలంకరించిన ఫొటోలను ట్యాగ్‌ చేస్తూ గురువారం ఈ మేరకు ట్వీట్‌ చేశారు.
 
దేశ ప్రజలందరికీ చంద్రబాబు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే గర్వించదగిన స్వాతంత్య్ర ఉద్యమ చరిత్ర మనదని ట్వీట్‌ చేశారు. అలాగే, రాఖీ పండుగ సందర్భంగా తెలుగింటి ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే హైదరాబాద్‌లోని నివాసంలో చంద్రబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. చంద్రబాబు, లోకేశ్‌, దేవాన్ష్‌ జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీమంత్రి భూమా అఖిలప్రియ, తెలంగాణ టీడీపీ మహిళా విభాగం నాయకురాలు జాటోతు ఇందిర తదితరులు చంద్రబాబుకు రాఖీలు కట్టారు. స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని నారా లోకేశ్‌ పేర్కొన్నారు.