కశ్మీర్ ప్రశాంతం.. పాక్ కుట్ర బట్టబయలు

ఆర్టికల్ 370 రద్దు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్ విభజన నేపథ్యంలో కశ్మీర్ లోయలో కీలక బక్రీద్ పండుగ శాంతియుతంగా జరిగింది. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని లోయలో ముస్లిం ప్రజలు పెద్ద ఎత్తున ప్రార్థనల్లో పాల్గొన్నారు. పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అధికార యంత్రాంగం, భారత సైన్యం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. కశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో నిషేధాజ్ఞలను సడలించి.. పండుగపూట జనజీవనం సాఫీగా సాగేవిధంగా చర్యలు తీసుకున్నారు. అనేక ప్రాంతాల్లో ముస్లిం ప్రజల ప్రార్థనల నిర్వహణలో భారత బలగాలు సహకరించాయి. జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో పర్యటించి.. స్థానికంగా పరిస్థితులను బేరిజు వేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లోయలో ఇంతవరకు ఒక్క బుల్లెట్ కూడా ప్రయోగించలేదని, బక్రీద్ పర్వదినం సందర్భంగా అంతా ప్రశాంతంగా ఉందని కశ్మీర్ ఐజీ ఎస్పీ పాణి స్పష్టం చేశారు.
