Published: 13-08-2019
పోలీసు స్టేషన్‌పై దాడి చేశారని జనసేన ఎమ్మెల్యేపై కేసు

పేకాడుతున్న వారికి వత్తాసు పలకడమే కాకుండా పోలీస్‌స్టేషన్‌పై దౌర్జన్యానికి దిగి ప్రభుత్వ ఆస్తిని నష్టపరిచారనే అభియోగాలతో తూర్పుగోదావరి జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ సోమవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. మలికిపురంలో ఆదివారం పేకాడుతున్న 9 మందిని ఎస్‌ఐ కేవీ రామారావు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో నిందితులను విడిచిపెట్టాలని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌తో పాటు అతని అనుచరుడు గెడ్డం తులసి భాస్కర్ ఎస్‌ఐతో ఘర్షణ పడడమే కాకుండా, సుమారు 100 మందితో కలిసి పోలీస్‌స్టేషన్‌పైకి రాళ్ళు రువ్వి స్టేషన్ కిటికీ అద్దాలు పగులగొట్టారని, పోలీసు విధులకు ఆటంకం కలిగించారని ఎస్పీ పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేతోపాటు, ఆయన అనుచరులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా, గతంలోనూ రాపాకపై రెండు కేసులు ఉన్నాయని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమేనని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టపరంగా చర్యలు తప్పవని ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్‌ఖాన్, ఎస్పీ అద్నన్ నయీంఅస్మీ హెచ్చరించారు.
