Published: 12-08-2019
శ్రీలంక హై కమిషనర్‌కు ఏపీ గవర్నర్ విన్నపం

ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద సముద్ర తీరం ఉందని, పెట్టుబడులకు రాష్ట్రం అన్ని విధాలా అనుకూలమని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో శ్రీలంక హై కమిషనర్ ఆస్టిన్ ఫెర్నాండో గవర్నర్‌ను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏపీలో విశిష్ట బౌద్ధ పుణ్యక్షేత్రాల గురించి ఆయనకు గవర్నర్ వివరించారు. శ్రీలంక, ఏపీ మధ్య పర్యాటక రంగం అభివృద్ధికి సహకరించాలని కోరారు. పెట్టుబడులు పెట్టే వారికి సింగల్ విండో పథకం ద్వారా త్వరిగతిన అనుమతులు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా శ్రీలంక హై కమిషనర్ ఫెన్నాండో కల్పించుకుని భారత్‌తో వ్యాపారం చేస్తున్న సార్క్ దేశాల్లో శ్రీలంక అతి పెద్దదని తెలిపారు. శ్రీలంక, భారత్ మధ్య అనేక రంగాల్లో మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని వివరించారు. ఈ సందర్భంగా శ్రీలంక హై కమిషనర్ గవర్నర్‌ను మొమెంటోతో సత్కరించారు.
కేంద్ర విదేశీ వ్యవహారాలు, పార్లమెంట్ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ కూడా గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వీరితో పాటు బీజేపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు, మాజీ మంత్రి మాణిక్యాలరావు గవర్నర్‌ను కలిశారు.
